‘రాష్ట్రాన్ని రాసిచ్చేస్తా..’ అంటూ సినిమాల్లో డైలాగులు చెబుతుంటే నవ్వుకుంటాం. కానీ, తెలుగు రాష్ట్రాల్లో నిజంగానే ఈ రాసిచ్చే కార్యక్రమం చాపకింద నీరులా జరిగిపోతోంది. మెఘా మేళ్ల కోసం రెండు ప్రభుత్వాలూ పోటీ పడి మరీ ఆస్తులన్నీ ధారాదత్తం చేస్తుండటం విశేషం.
విజయవాడ: కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను కాంట్రాక్టు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందా..? పోలవరం రివర్స్ టెండరింగ్ ‘నష్ట పరిహారం’గా ఎలక్ర్టిక్ బస్సుల కాంట్రాక్టు తీసుకోబోతున్న సంస్థకు మెఘా మేళ్లు చేయడానికి ఈ విలువైన స్థలాలను స్వాధీనం చేసుకోబోతోందా.? ఇదీ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగ వర్గాలలో జరుగుతున్న డిస్కషన్.
కేంద్రం సబ్సిడీ అందించే గ్రీన్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. ఈ బస్సుల్ని సొంతంగా కొనగలిగే అవకాశం వున్నప్పటికీ ప్రైవేట్ సంస్థలకు మేలు చేయాలనే ఆలోచనతో వున్న ప్రభుత్వ పెద్దలు ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎలక్ర్టిక్ బస్సుల్ని అద్దెకు తీసుకునేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆర్టీసీ ఇటీవల గ్లోబల్ టెండర్లు పిలిచింది. టెండర్లు ఖరారు చేశాక, మెఘా మేళ్లు ఎవరికి తలపెట్టారన్నది బయటపడుతుంది.
ఐతే, ఈ మేళ్లు కేవలం కాంట్రాక్టు రూపంలోనే వుండబోవడం లేదు. విలువైన భూముల రూపంలో కూడా వుండబోతున్నాయి. అదెలాగంటే.. ఆర్టీసీ ఖరారు చేసే టెండర్లలో ఎవరైతే సరఫరాదారుగా ఎంపిక అవుతారో ఆ సరఫరాదారు ప్రైవేట్ బస్సుల్ని అందించాల్సివుంటుంది. ఒక్క విజయవాడ నగరం వరకే తీసుకుంటే ఈ సిటీకి 150 బస్సులను అందించాల్సి ఉంటుంది. అంతవరకు ఓకే. అసలు కథ ఇక్కడే వుంది.
ఆర్టీసీకి విజయవాడలో వున్న విద్యాధరపురం, గన్నవరం డిపోలకు సంబంధించి అత్యంత విలువైన స్థలాలు ఉన్నాయి. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ ఇప్పుడు వందల కోట్లలో ఉంటుంది. సిటీ డివిజన్ పరిధిలో ఎలక్ర్టిక్ బస్సుల నిర్వహణ కోసం మెయింట్‌నెన్స్ డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే కారణం చూపి ఆర్టీసీ అధికారులు ఎంతో ‘ముందుచూపు’తో ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. తద్వారా విలువైన ఈ స్థలాలను ప్రయివేట్ పరం చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఎవరి ఆదేశాల మేరకు ఇవి సిద్ధం చేశారనేది ష్.. గప్‌చుప్..
మెయింట్‌నెన్స్ డిపోకు కేటాయించే స్థలాలను సంవత్సరానికి రూపాయికి అద్దెకు ఇస్తున్నట్టు అధికారులు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్’ (ఆర్‌ఎఫ్‌పీ)లో సూచించారు. అదే ఇప్పుడు అందరి నోట్లో నానుతోంది. ఎవరి ప్రయోజనాల కోసం ముందు చూపుతో ఈ ఆర్ఎఫ్‌పీలో ఈ ప్రతిపాదన చేశారో అందరికీ అర్ధం అవుతోంది.
ఓపక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. విలీనం చేయడం అంటే మరో అర్ధంలో ఇక మీదట సంస్థను క్రమక్రమంగా ప్రైవేటీకరించడమే. ఆర్టీసీలో ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనమయ్యారు. సంస్థ విలీనం కాదు. సంస్థ నిర్వహించే బస్సుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవచ్చు. అంటే, ఇకమీదట ఎపీఎస్ ఆర్‌టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యం అనివార్యం అవ్వబోతోంది. ఎలక్ర్టిక్ బస్సులు కొనుగోలు చేయాలనుకోవటం అందులో తొలి అడుగు. బస్సుల్ని అద్దెకు తీసుకోవటంతో మొదలయ్యే ప్రైవేటు భాగస్వామ్యం నెమ్మదినెమ్మదిగా నిర్వహణ, ఇతర రంగాలకు విస్తరిస్తుంది.
ఇదిలావుంటే, అద్దె ప్రాతిపదికన తీసుకునే బస్సుల కోసం సంస్థ ఆస్తులను ఎందుకు కట్టబెడుతున్నారనేది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ప్రభుత్వరంగ సంస్థకు చెందిన విలువైన భూముల్ని ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించాల్సిన అవసరం ఏమి ఉంటుందనేదే అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.
కార్పొరేట్ స్థాయి ఉన్న బస్సుల బల్క్ సప్లయర్‌కు అప్పనంగా కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను ఎందుకు అప్పగిస్తున్నారు? ఇందులో మతలబు ఏంటీ అనేదే అందరికీ ఒక సందేహం. ఎవరి ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారో ఆర్టీసీ అధికారులకే తెలియాలి. ఇలాంటి అవకతవక వ్యవహారాలకు అంగీకరించడనే కారణంతోనే సురేంద్రబాబుని బదిలీచేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
అసలు, ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేస్తే గ్యారేజీల పరిధిలో మెయింట్‌నెన్స్ డిపోలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు ఎలక్ర్టికల్ బస్సుల్ని ప్రైవేట్ సంస్థ కొనుగోలు చేసి అందిస్తుండటం వల్ల వాటి నిర్వహణ కోసం మెయింట్‌నెన్స్ డిపోల ఏర్పాటు అనివార్యమని సాకు చెబుతున్నారు. ఆ సాకు చెప్పి ఐదు ఎకరాల విలువైన స్థలాన్ని కారుచౌకగా అద్దె రూపాయి మాత్రమే వసూలు చేస్తూ ప్రయివేట్ సంస్థకు అప్పగించాలనుకోవడమే అనుమానాస్పదంగా వుంది.
ఆర్టీసీలో బస్సులను అద్దెకు తీసుకోవడం కొత్త విషయం కూడా కాదు. అనేక ఏళ్లుగా అది జరుగుతోంది. వాటి విషయంలో ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో, అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ర్టిక్ బస్సుల విషయంలో కూడా ఆర్టీసీ అధికారులు అదే వైఖరిని అవలంభించాలి. కానీ, అది పక్కనబెట్టి ప్రైవేట్ ఎలక్ర్టికల్ బస్సుల్ని సరఫరా చేసే కాంట్రాక్టు సంస్థకు మెఘా మేళ్లు చేయాలనే ముందుచూపుతో ఐదు ఎకరాల విలువైన స్థలాన్ని రూపాయి లీజుకు ఇవ్వాలనుకోవడమే విచిత్రం.
సాధారణంగా ఆర్టీసీకి అద్దె బస్సుల్ని ఇచ్చే కాంట్రాక్టరు ఆ బస్సులన్నీ తనే సొంతంగా నిర్వహించుకుంటాడు. ఈ బస్సుల్లో డ్రైవర్, క్లీనర్ కాంట్రాక్టు సంస్థకు సంబంధించిన వాళ్లే వుంటారు. ఒక్క కండక్టర్ మాత్రం ఆర్టీసీకి చెందినవాడు వుంటాడు. రూట్లలో తిరిగే ముందు ఆ ప్రయివేట్ బస్సును ఆ కాంట్రాక్టరు బయటే సిద్ధం చేసుకుని పంపిస్తాడు. బిజినెస్ పూర్తిగా తనదే కాబట్టి ఆ బస్సు నిర్వహణ కూడా అతనే చేసుకుంటాడు. ఇప్పటి వరకు ప్రయివేట్ బస్సుల విషయంలో ఇదే విధాన నిర్ణయం. ఇప్పుడు కూడా ఎలక్ర్టికల్ బస్సులకు సంబంధించి కూడా వ్యాపారం చేసేది బల్క్ సప్లయర్ కాబట్టి అతనే వాటి మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకోవాలి.
ఒకవేళ డిపోల సమీపంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను వుంచాలని అనుకున్నా.. ఆ ఖాళీ స్థలాలను ఆ కాంట్రాక్టు సంస్థకు ఐదు ఎకరాలు రూపాయి లీజుకు ఎందుకు ఇస్తున్నారనేదే మతలబుగా వుంది. విద్యుత్ బస్సుల కోసం ఇలా ఆర్టీసీ స్థలాలను అందిస్తే భవిష్యత్తులో డీజిల్ అద్దె బస్సులను నడిపే యజమానులు కూడా స్థలాలు అడుగుతారు. వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది.? ఎలక్ర్టిక్‌బస్సుల కాంట్రాక్టు సంస్థకు ఎలా ఉచితంగా స్థలాలను కేటాయించారో మాకు కూడా అలా రూపాయికి ఐదు ఎకరాల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తే ఆర్టీసీ అధికారులు ఏం సమాధానం చెబుతారు ? విజయవాడ నగర డివిజన్ పరిధిలో విద్యుత్ అద్దె బస్సుల కోసం విద్యాధరపురం, గన్నవరం ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రాంతాలలో ఆర్టీసీకి చెందిన విలువైన భూములు ఉన్నాయి. విద్యాధరపురంలో కొత్త బస్సులను నిలుపుదల చేసే యార్డు ఉంది. గన్నవరంలోనూ విశాలమైన గ్యారేజీ ఆవరణ ఉంది. ఈ రెండు ప్రాంతాలలో ఎకరం విలువ సుమారు ఐదు కోట్ల వరకు వుంటుంది. ఎలక్ర్టిక్ బస్సుల మెయింట్‌నెన్స్ డిపోలకు కనీసం ఐదుఎకరాల అవసరం అవుతుందన్నది అంచనా. మెయింట్‌నెన్స్ డిపోలలో గరిష్టంగా 100 బస్సులను నిలుపుదల చేయాల్సి ఉంటుంది. ఈ బస్సుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలి. షెడ్ వంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఛార్జింగ్ పాయింట్లు, షెడ్ల ఏర్పాటు కూడా బహుశా ప్రభుత్వమే అందించినా ఆశ్చర్యం లేదు. వోవరాల్‌గా మెఘా మేళ్ల కోసం ప్రభుత్వం ఇలా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన విలువైన స్థలాలను అప్పగిస్తూ పోతే చివరికి ఇది ఎక్కడ తేలుతుంది..?