వైద్యరంగంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. జిల్లాలు, గ్రామాల్లో బ్లాక్ లెవల్స్ లో అత్యవసర ఆరోగ్య సదుపాయాలను తీసుకువస్తాము, వాటి నిర్వహణ, ఆధునీకరణ వంటి అంశాల్లో ప్రైవేట్ సెక్టార్ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ తెలిపారు. బడ్జెట్ పై వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వెబినార్ లో శనివారం ఆయన పాల్గొని మాట్లాడుతూ….
వైద్యరంగంపై సమగ్ర విధానాన్ని కేంద్రం అవలంభిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఆరోగ్యంతో పాటు సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరుల విస్తరణ, పరిశోధనలను ప్రోత్సహించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయింపులు చేసినట్టు తెలిపారు.
‘ వన్ ఇండియా- వన్ హెల్త్ ‘ స్ఫూర్తితో జిల్లాలు, గ్రామాల్లో బ్లాక్ లెవల్స్ లో అత్యవసర ఆరోగ్య సదుపాయాలను తీసుకువస్తాము. ఆ సదుపాయాల నిర్వహణ, ఆధునీకరణ వంటి అంశాల్లో ప్రైవేట్ సెక్టార్ కీలక పాత్ర పోషిస్తుంది” అని వెల్లడించారు.
అది స్వఛ్చ భారత్ మిషన్ అయినా, ఫిట్ ఇండియా, న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంధ్ర ధనుష్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ అయినా వాటన్నింటినీ అత్యధికుల చెంతకు తీసుకు వెళ్లాము. ఇటీవల వైద్య సేవలకు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల ఈ ఏడాది వైద్య విద్యకు, వైద్యరంగంలో మానవ వనరుల విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయింపులు చేశాము” అని తెలిపారు.