జనరేషన్ మారుతున్న కొద్ది ఆలోచనలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటి జనాలు దేనిని కూడా వృధాగా పోనిచ్చేందుకు ఇష్టపడడం లేదు. అయితే.. ఒక్కోసారి కొందరి ఆలోచనా తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. తాజాగా.. కేరళ ప్రభుత్వం ఆలోచన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. కేరళ అంటేనే అక్షరాస్యతలో ఎప్పుడు టాప్ లో ఉండే రాష్ట్రంగా మంచి పేరుంది. ఈ సందర్భంలో అక్కడి ప్రభుత్వం చదువు విషయంలో ఓ అడుగు ముందుకేసింది.
డొక్కు బస్సులని క్లాస్‌రూమ్‌లుగా మార్చాలని అనుకుంటుంది. దీంతో ఇటు తరగతి గదుల కొరత సమస్య తీరడంతో పాటు.. కాలం చెల్లిన బస్సులను ఉపయోగంలో పెట్టినట్టు అవుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే.. ఇప్పటి వరకు రెండు బస్సులను క్లాస్ రూంలుగా మార్చనున్న ప్రభుత్వం.. ఆ తర్వాత 400 వరకు బస్సులను అదే విధంగా మార్చేందుకు యోచిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ విషయాన్నికేరళ రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు ధ్రువీకరించారు. కాగా.. గతంలో కోవిడ్ దెబ్బకు కొంతమంది ప్రైవేట్ టావెల్స్ ఓనర్లు తమ బస్సులను అమ్ముకున్నారు. కాలం చెల్లిన బస్సులను తిరిగి రోడ్డుపైకి తెచ్చే పరిస్థితి లేదని.. వాటిని స్క్రాప్ లుగా విక్రయించడం కంటే ఈ విధంగా ఉపయోగించాలనే ఆలోచన వచ్చినట్టు మంత్రి స్పష్టం చేశారు. అందులోనూ లోఫ్లోర్ బస్సులను తరగతి గదులుగా మార్చాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పిల్లలకు కొత్త అనుభూతిని అందించాలని భావిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
అందులో భాగంగా మొదట రెండు ఫ్లోర్ బస్సులను తిరువనంతపురంలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం నిరుపయోగంగా ఉన్న వందలాది బస్సులను అన్ని పాఠశాలలకు విస్తరింపజేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 400 బస్సులను తరగతి గదులుగా మార్చేందుకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు మంత్రి. దీంతో ప్రభుత్వ బడుల్లో తరగతి గదుల కొరత తీరనుందని వివరించారు. పప్పనంకోడ్ డిపోకు చెందిన పాత కేఎస్ఆర్టీసీ బస్సును క్రేన్ సాయంతో క్యాంపస్ కు తరలించి క్లాస్ రూమ్ గా మార్చామని.. కేరళ వర్సిటీలోని బయో ఇన్ ఫార్మాటిక్స్ విభాగంలో ఈ క్లాస్ రూమ్ బస్సును ఉంచామని స్పష్టం చేశారు మంత్రి రాజు.