బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అసలు ఇది ఏంటి..? దానివల్ల ఉపయోగాలేంటి..? అనే ప్రశ్నలపై నెట్టింట శోధన జరుగుతోంది. బ్యాంకులకు నాన్ పెర్ ఫార్మింగ్ ఎసెట్స్ బెడద ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది కేంద్రం. ఇది పని చేయడం కోసం మొత్తం రూ.30,600 కోట్ల విలువైన రశీదులకు కేంద్రం హామీ ఇస్తుంది.
బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి..?
మొండి బకాయిలు పేరుకుపోతే బ్యాంకులు నడవడం కష్టం. ఒకవేళ రోజురోజుకూ అవి ఎక్కువయితే ఆర్థిక వ్యవస్థపైనే ప్రమాదం పడే ఛాన్స్ ఉంది. మొండి లోన్స్ సంక్షోభం నుంచి బ్యాంకులను గట్టెక్కించే ప్రక్రియే బ్యాడ్ బ్యాంక్. అసలు పేరు నేషనల్ అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. ఇది అన్ని బ్యాంకులను బ్యాడ్ లోన్స్ నుంచి బయటకు తీసుకొస్తుంది. దానివల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదం ఉండదు. కార్యకలాపాలన్నీ యథావిధిగానే కొనసాగుతాయి. మొండి బకాయిలను వసూలు చేసే బాధ్యత బ్యాడ్ బ్యాంక్ దే. ఈ నేషనల్ అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ మొదట బ్యాంకుల నుంచి బ్యాడ్ లోన్స్ ను కొనుగోలు చేస్తుంది. అది అంగీకరించిన ధరలో 15శాతం నగదు రూపంలో చెల్లించి మిగిలిన 85శాతం రసీదుల రూపంలో బ్యాంకులకు అందిస్తుంది. ఆస్తులను అమ్మిన తరువాత ఇండియా డెబ్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ సహాయంతో బ్యాంకులకు మిగిలిన 85శాతం తిరిగి చెల్లిస్తుంది. లేని పక్షంలో బ్యాంకులు ప్రభుత్వం అందించిన రూ.30,600 కోట్ల నుంచి డబ్బులు తీసుకోవచ్చు.
నిజానికి 2018లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2 మాత్రమే లాభాల్లో ఉన్నాయి. కానీ.. 2020-21 నాటికి 2 బ్యాంకులు మాత్రమే నష్టాలు ప్రకటించాయి. పలు కంపెనీల నుంచి వచ్చిన రికవరీల కారణంగానే బ్యాంకింగ్ రంగం గట్టెక్క గలిగిందనేది నిపుణుల మాట. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే చెబుతున్నారు. గత 6 ఫైనాన్షియల్ ఇయర్స్ లో ప్రభుత్వం, ఆర్బీఐ చొరవ కారణంగా మొత్తం రూ.5,01,479 కోట్లను రికవరీ చేయగలిగినట్లు చెప్పారు. మార్చి 2018 నుంచి చూస్తే రూ. 3.1 లక్షల కోట్ల రికవరీ జరిగిందని అంటున్నారామె.