కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యండా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతులు 21 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనలను తెలియజేస్తున్నారు. వారు కోరుతున్నట్టు కొన్ని సవరణలు చేసేందుకు కేంద్రం అనుకూలంగా ఉన్నప్పటికీ.. రైతులు మాత్రం మొత్తం చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.నొప్పించక తానొవ్వక అన్న రీతిలో.. వ్యవసాయ చట్టాలపై కేంద్రం మరో ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను ఈ మూడు చట్టాల నుంచి మినహాయించే ఆలోచన కేంద్రం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైతులు కోరుతున్న మద్దతు ధర ఇస్తూ..ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాల అమలును ఉపసంహరించకునేలా మరో బిల్లు పెట్టే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది ఆచరణ సాధ్యం కాదేమోనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఇప్పటివరకు తటస్థంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఈ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఉద్యమం మొదలుపెట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.