గంగానది ప్రక్షాళనకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ప్రక్షాళన కోసం ఇంత వరకు తీసుకున్న చర్యలు ఎంతమేరకు సఫలమయ్యాయో తెలసుకునేందుకు అధ్యయనాలు చేస్తోంది. ఇందుకోసం రెండు రకాల చేపలను వినియోగించాలన్న భావనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.
ఈ పరిశోధనల కోసం ముందుగా డాల్ఫిన్లు, హిల్సా చేపల జీవిత చక్రంపై అధ్యయనం చేయనున్నది. కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహాయంతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) శాస్రవేత్తలు అధ్యయనం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా జలచరజీవులైన డాల్ఫిన్లు, హిల్సా చేపలు, సూక్ష్మజీవులపై అధ్యయనం చేపట్టి తద్వారా నది ఎంత వరకు శుభ్రంగా మారిందో తెలుసుకోనున్నారు. దీనిపై ఎన్ఎంసీజీ డైరెక్టర్ జనరల్ జీ అశోక్ కుమార్ మాట్లాడుతూ…
నది ఆరోగ్యాన్ని నెలకొల్పడంలో బయో ఇండికేటర్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయని తెలిపారు. నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను ఈ మిషన్ కింద చేపట్టామని చెప్పారు. నది ఎంతమేరకు మెరుగుపడింతో ఈ అధ్యయనం ద్వారా పరిశీలించాల్సి వుందన్నారు.
సూక్ష్మజీవుల వైవిధ్యంపై మానవుని ప్రభావం ఎంత వరకు ఉందన్న అంశంతో పాటు గంగా నదిలో ఉన్న ఈ.కోలై మూలాలపై కూడా అధ్యయనం చేయనున్నట్టు ఆయన వివరించారు. ఎన్ఎంసీజీ ద్వారా గంగా నదిపై జరుగుతున్న అధ్యయనాలు, పరిశోధనల్లో ఇది ఓ భాగమని తెలిపారు. గంగా నదికి సంబంధించిన అంశాలపై పరిశోధన, విధానం, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించినున్నట్టు చెప్పారు.