ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్త మంత్రి వర్గానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 24 మంది పాత మంత్రులు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. కాగా.. అవి శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మధ్యాహ్నానికి వెలువడనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త మంత్రుల జాబితాను కూడా గవర్నర్ ఆమోదం తెలపనున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కొత్త మంత్రుల లిస్ట్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.
కానీ.. పేర్లు మాత్రం అధికారికంగా ప్రకటించకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా మంత్రివర్గం విస్తరణలో పాత మంత్రులు 10 మంది కొనసాగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన చేసుకొని విస్తరణ చేపట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
పాత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని లు కొనసాగనున్నట్లు సమాచారం.