ఏపీ పంచాయితీ ఎన్నికల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చేయటంతో… ఎన్నికలు సజావుగా సాగేందుకు చర్యలు మొదలయ్యాయి. రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ఎస్‍ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్‍దాస్‍తో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై చర్చించారు.
ప్రభుత్వం-ఎస్‍ఈసీ మధ్య ఏర్పడ్డ అంతరం తగ్గించే ఉద్దేశంతోనే గవర్నర్ ఈ భేటీ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని సూచించిన గవర్నర్, అవసరం అయితే ఉమ్మడి భేటీకి ఏర్పాటు చేస్తానని సూచించినట్లు తెలుస్తోంది. ఇటు పంచాయతీరాజ్ అధికారుల అభిశంసనపై ఎస్‍ఈసీతో మాట్లాడిన గవర్నర్, శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్ ఆదిత్యనాథ్‍తో సమీక్ష నిర్వహించారు. పోలింగ్‍తోపాటు వ్యాక్సినేషన్‍కి తీసుకుంటున్న చర్యలపై సీఎస్‍తో చర్చించారు.
గవర్నర్ తో భేటీ అనంతరం ఎస్ఈసీ నిమ్మగడ్డ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీకి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా హజరయ్యారు.