గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేసీఆర్ హాజరు కాకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని.. పాలనా విషయాలలో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని.. అది కేసీఆర్ కు మింగుడు పడటం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనలేదని చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎంపీ అరవింద్ దాడి ఘటనపై గవర్నర్ ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది.
నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎంపీ అరవింద్ పై దాడి జరిగింది. పసుపు రైతుల పేరుతో టీఆర్ఎస్ గూండాలు ఈ దాడికి పాల్పడ్డాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం కాగా.. కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్ కు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఫోన్ చేశారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
దాడి వివరాలు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్, పోలీసుల తీరును గవర్నర్ కు వివరించారు అరవింద్. సీపీ పర్యవేక్షణలోనే తన హత్యకు ప్లాన్ జరిగిందని.. దాడి జరిగే అవకాశం ఉందని ముందుగానే సమాచారం ఇచ్చినా రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదని గవర్నర్ కు తెలిపారు. తన సొంత నియోజకవర్గంలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని గవర్నర్ కు వివరించారు.
ఈ మధ్య కాలంలో ప్రజా ప్రతినిధులపై పోలీసుల సమక్షంలోనే.. కొన్నిసార్లు పోలీసులే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు అరవింద్. ఈ విషయంపై డీజీపీతో, కేంద్ర హోం శాఖతో చర్చించి తగు చర్యలకు సూచిస్తానని తమిళిసై హామీ ఇచ్చారని చెప్పారు.