ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీల, సీఎంవో అధికారులకు లేఖ రాయటం సంచలనంగా మారింది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అంశంలో గవర్నర్ కు ఏపీ సీఎం, ఎస్ఈసీ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవటం, తనకు హాని ఉందంటూ కమీషనర్ రమేష్ కుమార్ ఏకంగా కేంద్రానికి లేఖ రాయటంతో ఏపీ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా వేడేక్కాయి.
అయితే, గవర్నర్ తాజాగా రాసిన లేఖలో రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలపై గవర్నర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు, వాటి అమలు తీరు… రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే… ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నా, ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో దృష్టపెట్టలేదని, ఇతర రాష్ట్రాలు కరోనా వైరస్ పై ఎంతో అప్రమత్తతో ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్న సందర్భంలో గవర్నర్ ఆరా తీయటం కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఏపీలో ఎక్కువగా ఉందని… నివారణకు మరిన్ని కఠిన నిర్ణయాలతో పాటు పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.