తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ వార్ ముదురుతోంది. నిన్న తెలంగాణ సీఎస్, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పై సుప్రీంలో రిట్ పిటిషన్ వేస్తే.. ఈరోజు ఆమె ట్విట్టర్ వేదికగా సీఎస్ కు చురకలంటించడం హాట్ టాపిక్ గా మారింది.
రాజ్ భవన్ ఢిల్లీ కంటే చాలా దగ్గరగా ఉందని, సీఎస్ స్థాయిలో రాజ్ భవన్ కు రావడానికి మీకు టైం దొరకలేదా అని తమిళి సై ఎద్దేవా చేశారు. కనీసం మినిమమ్ ప్రోటోకాల్ ను కూడా పాటించాలని తెలియదా.. కనీసం ఫోన్ కాల్ చేయాలన్న కర్టసీ కూడా లేదా.. అని ఆమె సీఎస్ ను నిలదీశారు. స్నేహాపూర్వకంగా రాజ్ భవన్ కు వచ్చి కలవాలన్న ఆలోచన కూడా మీకు లేకపోవడం శోచనీయమన్నారు తమిళి సై.
ఇక గవర్నర్ తమిళి సై పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. చీఫ్ సెక్రటరీ ఈ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయడం విశేషం.
గవర్నర్ వ్యవహార తీరు బాగోలేదని.. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకపోవటాన్ని తప్పుపడుతుంది ప్రభుత్వం. ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కి పెడుతున్నారని వాదిస్తూ..గవర్నర్ పరిధి ఏంటీ.. ఎందుకు బిల్లులు ఆమోదించడం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఈ క్రమంలోనే పిటిషన్ దాఖలు చేస్తూ.. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సర్కార్. ఈ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చే అవకాశముంది. రిట్ పిటిషన్ విచారణతో గవర్నర్ పరిధి ఏంటీ అనే విషయంలో స్పష్టత వస్తుందని..బీజేపీ పాలనలో గవర్నర్ల తీరును దేశవ్యాప్తంగా తీసుకెళ్లినట్టు అవుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.