పుదుచ్చేరి రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. మొన్నటి వరకు గవర్నర్ కిరణ్ బేడి, సీఎం నారాయణ స్వామి మధ్య జరిగిన ఆధిపత్య పోరు చివరి దశకు చేరింది. ఇప్పటికే గవర్నర్ గా కిరణ్ బేడిని తప్పించి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అయితే, కాంగ్రెస్ తరుపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతో… కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తంగా ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతో, ప్రభుత్వానికి 15మంది అసెంబ్లీ సభ్యుల అవసరం ఉంది. అయితే, బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ సభ్యులు మద్ధతు పలకనున్నారు. కానీ సీఎం మాత్రం నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదని వాదిస్తున్నారు.
ఫిబ్రవరి 22న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సీఎం నారాయణ స్వామిని గవర్నర్ ఆదేశించారు. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలుండగా, కాంగ్రెస్ 10సీట్లు గెలుచుకొని డీఏంకే నుండి గెలిచిన ముగ్గురిని, ఒక ఇండిపెండెంట్ తో ప్రభుత్వంలో ఉంది. ప్రతిపక్షానికి కూడా 14సీట్లు ఉన్నాయి. 5 ఖాళీలున్నాయి.