హైదరాబాద్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు వరుసబెట్టి కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. అయితే.. ఇటు తమిళిసై కూడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం పుదుచ్చేరి వెళ్లారు గవర్నర్. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని 2 నెలల క్రితం ప్రభుత్వానికి లేఖ రాస్తే.. రాజ్ భవన్ లోనే జరుపుకోవాలని 2 రోజుల క్రితం ప్రభుత్వం చెప్పిందని అన్నారు తమిళిసై. ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని కొంతమంది యత్నించారని ఆరోపించారు. ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారన్న ఆమె.. రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం పట్టించుకోలేదని విమర్శించారు తమిళిసై. ఆఖరికి ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదన్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కొందరిని సన్మానించామని.. ప్రజల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు గవర్నర్. తెలంగాణలో అన్నీ అతిక్రమణలే అని అన్నారు. రాజ్యాంగ, రాజకీయ, చట్టపరమైన అతిక్రమణలున్నాయని.. లేకపోతే కోర్టు అనుమతి ఇవ్వదు కదా అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి తాను ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇచ్చానని స్పష్టం చేశారు తమిళిసై.
ప్రగతి భవన్, రాజ్ భవన్ వార్ జరుగుతుండగా.. మరోసారి తమిళిసై చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆమెపై ఫైరవుతున్నారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. అయితే.. గవర్నర్ మాత్రం తాను హద్దులు దాటడం లేదని అంటున్నారు.