తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం తమిళనాడులో పర్యటిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కింద పడిపోవడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమె లేచి నిల్చునేందుకు సహాయం చేశారు.
ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాను కింద పడిపోవడం మాత్రం టీవీల్లో పెద్ద వార్త అవుతుందని తమిళిసై చమత్కరించారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై సౌంద్రరాజన్ తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు.
వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రసంగించిన అనంతరం ఆమె తిరిగి కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కార్పెట్‌పై జారి పడిపోయారు. ఆమె వెంట ఉన్న సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే తమిళిసై పైకి లేచేందుకు సహాయం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉత్కంఠ నెలకొంది.
భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్‌ను ఆదివారం ఉదయం 8.15 గంటలకు మహాబలిపురం సమీపంలోని పత్తిపులంలో ప్రయోగించారు. దేశంలోని 3500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సంయుక్తంగా రూపొందించిన 150 ఉపగ్రహాలను మోసుకెళ్లే హైబ్రిడ్ రాకెట్ ను ఇక్కడి నుంచి ప్రయోగించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై, ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, రామేశ్వరం, మార్టిన్ ఫౌండేషన్, తమిళనాడు అండ్ స్పేస్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై సహకారంతో దేశంలో తొలి హైబ్రిడ్ రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని మహాబలిపురం సమీపంలో ఆదివారం నిర్వహించారు.