– ప్రభుత్వం నుంచి సహకారం లేదు
– తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా
– మహిళా దర్బార్ లో గవర్నర్
మహిళా సమస్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై పలువురు మహిళలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మహిళల గొంతును, ఆవేదనను వినాలనే లక్ష్యంతోనే మహిళా దర్బార్ నిర్వహించినట్లు తమిళి సై తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల కోసమే ప్రభుత్వ కార్యాలయాలు.. నన్నెవరూ అడ్డుకోలేరు
‘‘గవర్నర్ ప్రజలను కలుస్తారా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమేనని గుర్తుంచుకోవాలి. కోవిడ్ విజృంభిస్తున్న వేళ సెక్యూరిటీ వద్దన్నా అనేక మంది బాధితులను పరామర్శించాను. సమాజంలో మహిళలు అనేక బాధలు పడుతున్నారు. అందుకే తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలని భావిస్తున్నాను. ప్రభుత్వానికి, మహిళలకు మధ్య వారధిగా ఉంటాను. నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణ ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని నేను పట్టించుకోను’’ అని తమిళి సై తేల్చిచెప్పారు.
మహిళా రక్షణలో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు
‘‘బాలికలు, మహిళలపై జరుగుతున్న దారుణాలను చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది. జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా స్పందించలేదు. గతంలోనూ నా విషయంలో ప్రొటోకాల్ పాటించలేదు. దీనిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నేనేమీ నా కోసం పోరాటం చేయడం లేదు. మహిళలను ఆదుకోవడానికి నేను ఎప్పుడూ బలంగా ఉంటాను. బాధితులు ఎవరైనా వారి కోసం నా హృదయం రోధిస్తుంది. నా బలమైన స్వరంతో మహిళల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తాను. రాజ్ భవన్ నుంచి వచ్చే వినతులు అధికారులు పరిష్కరించాలి. మహిళా దర్బార్ వెనుక ఎలాంటి రాజకీయం లేదు. భవిష్యత్తులోనూ కొనసాగిస్తా’’ అని గవర్నర్ స్పష్టం చేశారు.
గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమిళిసై నిర్వహించిన మహిళా దర్బార్ పై చర్చ జరుగుతోంది.