ప్రధాని మోడీతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు.. తనకు ఎదురైన అవమానాలు, గిరిజనుల సమస్యల గురించి వివరించారు. గత కొంతకాలంగా రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగింది. గవర్నర్ కు సంబంధించిన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ నేతలు పాల్గొనకపోవడం వివాదాస్పదం అవుతోంది. ఆఖరికి తమిళిసై జిల్లాల పర్యటనకు వెళ్లినా కనీసం ఎమ్మెల్యేలు స్వాగతం పలకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు తమిళిసై. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని.. అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని.. ప్రభుత్వంతోనూ సఖ్యతగానే ఉండటానికి ప్రయత్నించానని చెప్పారు. తాను తెలంగాణలో అధికారం చెలాయించడం లేదన్న ఆమె.. ప్రధానికి అంతా తెలుసని వివరించారు.
ఏ చర్యలూ ఆపలేవని అంటూనే.. తనతో భేటీ కోసం సీఎం ఎప్పుడైనా ఆఫీస్ కు రావొచ్చని.. ఏ విషయంపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అవసరమైతే బహిరంగ చర్చకైనా సిద్ధమన్నారు. రాజ్ భవన్ ను, గవర్నర్ ను అవమానించారని.. అయినా కూడా తాను పట్టించుకోనని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ప్రోటోకాల్ తెలియదా? అంటూ చురకలంటించారు. గవర్నర్ కు ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని తెలిపారు తమిళి సై.
ఇక రాష్ట్రంలో గిరిజనుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో తన పర్యటనలు, అక్కడి సమస్యల గురించి వివరించానని వెల్లడించారు.