తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై కేంద్రానికి నేరుగా రిపోర్టు పంపారు. గణతంత్ర దినోత్సవాల విషయంలో మూడేళ్ళుగా జరుగుతున్న వేడుకల తీరును ఆమె ఇందులో ప్రస్తావించారు. ఈ ఉత్సవాలను నిర్వహించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని వ్యాఖ్యానించిన ఆమె.. ఇందుకోసం కరోనా నిబంధనలను సాకుగా చూపుతున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశించినా గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
కరోనా రూల్స్ ..సీఎం సభకు వర్తించవా అని ఆమె ప్రశ్నించారు. ఆ సభకు 5 లక్షలమంది వచ్చేలా ఏర్పాట్లు చేశారని ఆమె పేర్కొన్నారు, కలెక్టర్, ఎస్పీ సహా అధికారులపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ ఎవరో ఆదేశిస్తే వారిని శిక్షించడం సరికాదన్నారు. నా వల్ల వారికి బ్లాక్ మార్క్ రావడం నాకిష్టం లేదు.. నిజానికి ప్రోటోకాల్ విషయాలకు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఈ ప్రభుత్వం పాటించడం లేదు అని తమిళసై ఆరోపించారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల నిర్వహణపై రెండు నెలల క్రితమే తాను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని ఆమె తెలిపారు.
అయితే గవర్నర్ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. తమిళిసై వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
గవర్నర్ ని రీకాల్ చేయాలని తామిదివరకే డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా గవర్నర్ తమిళిసై తీరును తప్పు పట్టారు. ఆమె రాజ్యాంగం ప్రకారం నడచుకోవడం లేదన్నారు. ఈమె తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తామని, అసలు రిపబ్లిక్ దినోత్సవాల్లో రాజకీయాలు మాట్లాడడమేమిటని అన్నారు. రాజ్యాంగం అమలును రాజకీయాలకు వాడుకోవడం తగదని ఆయన చెప్పారు.