టెక్నాలజీని ఎప్పుడూ మంచి పనికే ఉపయోగించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై. శనివారం ఆమె కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన 11వ స్నాతకోత్సవనికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ గ్రహీత, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కృష్ణస్వామి కస్తూరీ రంగాకి డాక్టరేట్ ప్రధానం చేయడంతో పాటు వివిధ భాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది స్టూడెంట్స్ కి గోల్డ్ మెడల్స్ అందించారు. అలాగే యూజీ, పీజీ, పీహెచ్.డీ విభాగాల్లో 92,005 వేల మందికి డిగ్రీలను ప్రధానం చేశారు తమిళిసై.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టడంతోపాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు. మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఉపయోగం ఉండదని తెలియజేశారు.
పరీక్షలు జరుగుతున్నాయి అంటే అప్పటి కాలంలో ఎలా చదవాలి అని విద్యార్థులు అడిగేవారు.. కానీ ఇప్పుడు పరీక్షా పత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు అని అడిగే పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రస్తుతం ఊర్లలోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు అందుపుచ్చుకోవాలని గవర్నర్ కోరారు.
మహిళా విద్యార్థులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో కూడా దృష్టి సారించాలని వారికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక యుగంలో సమయం త్వరగా గడిచిపోవడంతో పాటు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని.. దానిని ఎప్పుడు మంచి పనికి ఉపయోగించాలని స్టూడెంట్స్ కి వెల్లడించారు గవర్నర్ తమిళిసై.