ప్రస్తుతం రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నిక, ఫిర్యాదుల పెట్టె, ప్రోటోకాల్ ఇలే అనేక అంశాల చుట్టూ వివాదం చెలరేగి చినికి చినికి గాలివానలా మారినట్టు.. ఢిల్లీ దగ్గరకు చేరింది పంచాయితీ. ఆ సమయంలో గవర్నర్ తమిళిసై టార్గెట్ గా టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే.. గవర్నర్ తనకు ఎలాంటి సమస్య లేదని.. దేనిపై చర్చించడానికైనా ఎప్పుడైనా, ఎవరైనా రాజ్ భవన్ కు రావొచ్చని ప్రభుత్వానికి స్పష్టంచేశారు.
కొద్దిరోజులుగా ఎలాంటి వివాదాలు లేకుండా సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి కారణం.. గవర్నర్ మహిళల కోసం ప్రత్యేక దర్బార్ ఏర్పాటు చేస్తుండటమే. ఈనెల 10న మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు రాజ్ భవన్ లో మహిళా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ప్రజా దర్బార్ లో భాగంగానే మహిళల సమస్యలను తెలుసుకోనున్నారు గవర్నర్. ప్రస్తుతం మైనర్ బాలిక అత్యాచారం కేసు సంచలనంగా మారిన సమయంలో గవర్నర్ చేపడుతున్న ఈ మహిళా దర్బార్ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలు వెల్లువెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సమాజంలో మహిళల సమస్యలు, వారి అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో పంచుకోవచ్చని పేర్కొన్నారు గవర్నర్. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 040-23310521 నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు. అలాగే రాజ్ భవన్ అధికారిక మెయిల్ ఐడీ rajbhavan-hyd@gov.in కు మెయిల్ చేసి అపాయింట్ మెంట్ తీసుకోవాలని కోరారు. మొత్తానికి ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు దూరం పెరిగిన ఈ క్రమంలో ఇది ఎటువైపు దారితీస్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.