తెలంగాణ నవజాత శిశువుతో సమానమని అభిప్రాయపడ్డారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రపంచ రోడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఇటీవలే తన తల్లిని కోల్పోయానని.. అక్కడికి వచ్చిన మాతృమూర్తుల్లో ఆమెను చూసుకుంటున్నట్లు తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు. రాజ్‌భవన్ కు వచ్చిన మాతృమూర్తులకు బహుమతులు అందజేసిన గవర్నర్.. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు.
గైనకాలజిస్ట్ గా ఉన్న జ్ఞానం పాలనలోనూ దోహదపడుతోందని తెలిపారు. వైద్యానికి సంబంధించిన అంశాలపై ఎవరైనా తనను సంప్రదించవచ్చని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల సంస్థను ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్లకు గవర్నర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. విపత్తుల సమయంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న రెడ్‌క్రాస్ ప్రతినిధుల్ని గవర్నర్ సత్కరించారు.
ట్విట్టర్, వాట్సాప్ లో అభ్యర్థనలు వచ్చినప్పుడు.. రెడ్‌క్రాస్ వారియర్స్ తన వెనుక ఉండటం వల్లే.. అర్ధరాత్రి సమయంలోనూ వేలాది మందికి సాయం చేయగలిగామన్నారు. లౌక్‌డౌన్ సమయంలో తలసేమియా బాధితులకు అండగా నిలవగలిగామని పేర్కొన్నారు. సహకరించిన పోలీసులు, ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు గవర్నర్.