తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. రాష్ట్ర బడ్జెట్‌కు ఇంకా గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. సోమవారం ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించింది.
కానీ ఇప్పటివరకు గవర్నర్ నుంచి బడ్జెట్‌కు ఆమోదం లభించలేదు. గవర్నర్ జాప్యం చేస్తుండటంతో.. హైకోర్టులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుశ్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. బడ్జెట్‌కు అనుమతి ఇవ్వాలని ఈ నెల 21న గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా.. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, దానికి సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్ కార్యాలయం ఒక లెటర్ రాసింది.
గవర్నర్ కార్యాలయం నుంచి వెళ్లిన లెటర్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ప్రక్రియను గవర్నర్ తమిళిసై కూడా పెండింగ్‌లో పెట్టారు. మరో మూడు రోజులు మాత్రమే బడ్జెట్ సమావేశాలకు సమయం ఉండటం, గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవడంతో.. ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో చివరికి గవర్నర్ తీరుపై హైకోర్టు మెట్లు ఎక్కాలని నిర్ణయం తీసుకుంది.
గతంలో గవర్నర్ ప్రసంగం లేనప్పటికీ బడ్జెట్‌కు తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ సారి మాత్రం పెండింగ్‌లో పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపాలని కోరుతున్నారు.గవర్నర్లను ఆదేశించే అధికారం కోర్టులకు ఉండదని గతంలో అనేక తీర్పుల్లో వెల్లడైంది. బడ్జెట్‌కు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌ను కోర్టు ఆదేశిస్తుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.
రాజ్యంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. గతంలో వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్.. ఈ సారి ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ గవర్నర్, ప్రభుత్వం మధ్య ఉన్న గ్యాప్ కారణంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే కేసీఆర్ సర్కార్ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తోంది.