గవర్నర్ వ్యవస్థపై తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్లు సాధారణంగా ఎక్కువ మాట్లాడతారని, తక్కువగా వింటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గవర్నర్లు పాటించాలా? వద్దా? అనే ప్రశ్నకు స్టాలిన్ బదులిచ్చారు.
గవర్నర్లు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే వారికి కేవలం నోరు మాత్రమే ఉందని, చెవులు లేనట్టు కనిపిస్తోందన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుపై కూడా ఆయన స్పందించారు. మనీశ్ సిసోడియా అరెస్టును ఆయన ఖండించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో తాను ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశానని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు బదులు దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై విజయం సాధించాలని ప్రయత్నించ వద్దని ప్రధానికి సూచించినట్టు చెప్పారు.
రాష్ట్రంలో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న నివేదికలపై ఆయన స్పందించారు. అవన్నీ తప్పుడు నివేదికలన్నారు. దశాబ్దాలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమిళనాడులో నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదన్నారు. గత కొన్నేళ్లుగా చాలా మంది ఉద్యోగాల కోసం తమిళనాడుకు వచ్చారన్నారు. వారు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కోవడంలేదన్నారు. కానీ కొందరు ఫేక్ వీడియోలను ఉపయోగించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.