కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ ను కూడా తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సన్ ఫ్లవర్, సోయాబీన్ నూనెలపై ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. 2024 వరకు మొత్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల నూనెల దిగుమతులపై పన్ను భారం ఉండదని వివరించింది.
దిగుమతుల కోటా కోసం సంస్థలు ఈ నెల 17 నుంచి జూన్ 18లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ కోటాకు మించి దిగుమతి చేసుకునే దిగుమతులపై మాములు సుంకాలు ఉంటాయని వెల్లడించింది.
ప్రభుత్వ ప్రకటనను కేంద్ర పరోక్ష, కస్టమ్స్ పన్నుల బోర్డు ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని, దీంతో ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించే అవకాశం ఉందని చెప్పింది.