ఉదయపూర్‌లో ఇటీవల జరిగిన హత్యను ప్రోత్సహించే, కీర్తించే లేదా సమర్థించే విధంగా ఉండే కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని అన్ని సోషల్ మీడియా కంపెనీలను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
హత్యకు సంబంధించిన ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన వీడియోలు, ఇతర దృశ్యాలు ఆ హత్యను సోషల్ మీడియా సమర్థించే, కీర్తించే విధంగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. శాంతి భద్రతలకు, సమాజంలో సామరస్యానికి భంగం కలిగించే అలాంటి వీడియోలను గుర్తించి తొలగించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇలాంటి హత్యలను సమర్థించే, ప్రోత్సహించే, కీర్తించే అంశాలు ఆడియో రూపంలో లేదా వీడియో లేదా టెక్స్ట్ రూపంలో ఉన్నప్పటికీ మీ బాధ్యతలో భాగంగా వాటిని ముందుగా గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన కన్హయ్య లాల్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చాడనే కారణంతో కన్హయ్య లాల్ ను ఇద్దరు మతోన్మాదులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ లు కత్తితో తల నరికి హత్య చేశారు.