వరంగల్ రింగ్ రోడ్డు వ్యవహారం కొద్ది రోజులుగా వివాదాస్పదమైంది. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్(కుడా) ల్యాండ్ పూలింగ్ కు ప్రయత్నించగా.. రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. పలు దఫాల చర్చల తర్వాత కూడా ప్రజలు వెనక్కి తగ్గలేదు. ధర్నాలు, నిరసనలు కొనసాగించారు. చివరకు చేసేదేం లేక.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టడంతో దిగొచ్చింది కేసీఆర్ సర్కార్. తక్షణమే ఈ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతుల ఆందోళనపై కుడా కార్యాలయంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లతో చైర్మన్ సుందర్ రాజ్ సమీక్షించారు. రైతుల ఇబ్బందులపై చర్చలు జరిపారు. తర్వాత ల్యాండ్ పూలింగ్ ను నిలిపివేస్తున్నట్లు సుందర్ రాజ్ ప్రకటించారు.
ఈ వరంగల్ రింగ్ రోడ్డు వ్యవహారంపై రాజకీయంగా కూడా చిచ్చు రాజుకుంది. రింగు రోడ్డు పేరిట టీఆర్ఎస్ మరో లూటీకి తెర తీసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి లాక్కునేందుకు.. కేసీఆర్, కేటీఆర్ తమ రియల్ ఎస్టేట్ మాఫియాను రంగంలోకి దించిందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే వందలు, వేల ఎకరాల భూములను రైతుల నుంచి అతి తక్కువ ధరకే లాగేసుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు రేవంత్ రెడ్డి.
వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని 8 మండలాల పరిధిలోని 28 గ్రామాలకు చెందిన 22,749 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించేందుకు జీవో 80 విడుదల చేసింది ప్రభుత్వం. 41 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు 2017లో కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టారు. రోడ్డుకు రెండువైపులా కిలోమీటర్ మేర ఉన్న భూములపై సర్వే చేపట్టి మండలాలు, గ్రామాలు సర్వే నెంబర్లతో సహా నోటిఫికేషన్ వెలువరించింది. వరంగల్ జిల్లాలో 15 గ్రామాలు, హన్మకొండలో 10, జనగామలో 3 గ్రామాల్లో వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులో చేర్చారు. రైతులు అంగీకారపత్రం ఇస్తేనే భూమిని తీసుకుంటామని.. బలవంతం ఉండదని అధికారులు చెప్పినా… లేఖ ఇవ్వకముందే నోటిఫికేషన్ వెలువడటంతో రైతులు ఆగ్రహించారు. ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. దీంతో చేసేదేం లేక ల్యాండ్ పూలింగ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.