‘ఎదుటి వారికి..చెప్పేటందుకె నీతులు ఉన్నాయి’ అని ఓ సినీకవి వ్యంగ్యవచనం. ఈ పాటలోని మాటను అక్షరాలా నిజం చేసాడు ఓ వ్యక్తి. వృత్తిరీత్యా అతనో గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. పాఠాల్లో ఆదర్శాలు వల్లిస్తాడు. నీతి న్యాయాల గురించి ఉపన్యాసాలు గుప్పిస్తాడు. కట్నం కింద ఖరీదైన కారివ్వలేదని పెళ్ళిని రద్దు చేసాడు. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే విజయ్‌నగర్‌లోని సిద్ధార్థ్ విహార్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది మేలో ఒక మహిళతో అతడికి పెళ్లి సంబంధం కుదిరింది. ఆ ఏడాది జూన్ 19న నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జనవరి 30న వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
కాగా, పెళ్లికి నెల రోజుల ముందే కట్నం కింద ఖరీదైన కారు కొనివ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో వధువు కుటుంబం అక్టోబర్ 10న వాగనార్‌ను బుక్ చేసింది. అయితే తమకు ఫార్చ్యూనర్ కారు కావాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది.
అంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చేందుకు వధువు కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 23న పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువు ఫోన్‌కు వరుడు మెసేజ్ పంపాడు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుడు, అతడి కుటుంబంపై వరకట్నం చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.