దీపావళి సందర్భంగా కేంద్రం ఆయిల్ సంస్థలకు ముందే ‘బొనాంజా’ ప్రకటించింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు వన్ టైం గ్రాంట్ గా 22 వేల కోట్ల రూపాయల సాయాన్ని ఇస్తున్నట్టు వెల్లడించింది. దేశీయంగా ఎల్పీజీ ధరల్లో హెచ్చు తగ్గుల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న వీటికి ఈ గ్రాంట్ వరమేనని చెప్పాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లకు ఈ గ్రాంట్ లభించనుంది.
2020 జూన్ నుంచి 2022 జూన్ వరకు అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు 300 శాతం పెరిగిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ కాలంలో దేశీయంగా వీటి ధరలు 72 శాతం పెరిగినఫలితంగా ఈ సంస్థలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రైల్వే ఉద్యోగులకు బోనస్ కూడా ప్రకటించింది.
వీరు 78 రోజుల బోనస్ అందుకోనున్నారు. దీనివల్ల ఖజానాపై రూ. 1832 కోట్ల భారం పడనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. బుధవారం కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడిస్తూ 11.27 లక్షల మంది నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ లభిస్తుందన్నారు.
ప్యాసింజర్, గూడ్స్ సర్వీసుల్లో ఈ సిబ్బంది కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు. ఉత్పాదకతతో అనుసంధించిన ఈ బోనస్ వీరికి దీపావళి బొనాంజా అని అభివర్ణించారు. కోవిడ్ అనంతరం దేశ ఆర్ధిక పరిస్థితులు సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.