సీఎం కేసీఆర్ ను ప్రభుత్వ ఉద్యోగులు భయపెడుతున్నారా…? వారిలో పెరిగిపోతున్నఅసంతృప్తిని చల్లార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడా…? అంటే ప్రగతి భవన్ వర్గాలు అవుననే అంటున్నాయి.
రాబోయే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికల్లో ఉద్యోగుల ప్రమేయం చాలా ఎక్కువ. ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు సాగర్ ఉప ఎన్నిక. దీంతో వచ్చే మూడు-నాలుగు నెలలు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణమే ఉంటుంది. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఓటు బ్యాంకుగా మారాలన్నా, ఓటర్లలో ఏ పార్టీపై అనుకూల వాతావరణం రావాలన్న ఉద్యోగులు క్రియాశీలకం. ఈ విషయం దుబ్బాకలో స్పష్టంగా కనపడగా, కేసీఆర్ కు కూడా స్పష్టమైన అవగాహన ఉంది.
పైగా ఈ ఎన్నికలు రాబోయే జమిలీ ఎన్నికలకు సెమీ ఫైనల్ వంటివి. ఖచ్చితంగా ఈ ఫలితాల ప్రభావం 2022లో వస్తాయని భావిస్తున్న జమిలీపై ఉంటుంది. దీంతో కేసీఆర్ నిర్ణయాలు కూడా అందుకు అనుగుణంగానే ఉండనున్నాయి. నిజానికి 2019లో రావాల్సిన పీఆర్సీ ఇంతవరకు రాలేదు. పోనీ మధ్యంతర భృతి ప్రకటిస్తారనుకుంటే అదీ లేదు. దీంతో ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వీటికితోడు భర్తీ చేయకుండా ఏర్పడుతున్న ఖాళీలతో పనిభారం కూడా పెరుగుతోంది. ఇది గమనించిన కేసీఆర్ ఉద్యోగ భర్తీతో పాటు జనవరిలో పీఆర్సీ ప్రకటన ఉంటుందన్నారు. కానీ జనవరి 24వ తేదీ వచ్చినా ఏమీ తేలకపోవటంతో… కేసీఆర్ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నానని, నెలాఖరు లోపు ప్రకటన ఉండాల్సిందేనంటూ అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ ప్రకటన చేయాలి అనుకుంటే ఒక్క మీటింగ్ తో పూర్తి చేయవచ్చని, కానీ ఉద్యోగుల్లో ఆసక్తిపెంచుతూ… చర్చ సాగేలా చేసి, ప్రకటన చేయాలన్నది ఆయన ఆలోచనగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే, అనుకున్న జనవరి ఎండింగ్ కు పీఆర్సీ ప్రకటన చేసే అవకాశం ఉందని, లేకపోతే కేసీఆర్ ను ఉద్యోగులు నమ్మే అవకాశం పోతుందని విశ్లేషిస్తున్నారు.