317 జీవో రద్దు చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చిలగాని సంపత్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జీవో నెం.317 రద్దు చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. దీని వల్ల అనేక మంది ఉద్యోగుల కుటుంబాలు చిన్నాభిన్నమై.. వాళ్ల స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మూల సిద్ధాంతమైన స్థానికతకు ఈ జీవోలో విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. సకల జనుల సమ్మె, మానవహారం, సహాయ నిరాకరణ లాంటి వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కనపెట్టేశారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఇది కేవలం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య మాత్రమే కాదని.. భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగ ఖాళీలు ఉండే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 317 జీవో ను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రక్రియ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగలంతా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, సీపీఎస్ ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.