పేదోడి భూమిని బడాబాబులు లాగేస్తే కబ్జా అంటాం. అదేపని ప్రభుత్వం చేస్తే ఏమనాలి. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనా..? ప్రకృతివనం అంటూ భూములు గుంజుకుంటున్నారు. కోట్లు పలుకుతున్నాయని గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని లాగేసుకుంటున్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. అడ్డగోలుగా ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ..?
గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమిని కేసీఆర్ సర్కార్ ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటోంది. హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్న ఖానామెట్ భూములే ఇందుకు నిదర్శనం. 1964 నుంచి ఇక్కడి భూముల్ని సాగు చేసుకుంటున్నారు పేద రైతులు. వారికి 1980లో పట్టాలు కూడా మంజూరయ్యాయి. అసైన్డ్ భూమిలో ఇళ్లు కట్టకూడదని.. చెప్పడంతో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. అయితే సైబరాబాద్ పుణ్యమా అని ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వం కన్ను వీటిపై పడింది.
రాత్రికి రాత్రి పొలాల్ని జేసీబీలతో చదును చేశారు. పచ్చని పంట పొలాల్ని నాశనం చేశారు అధికారులు. ఈ భూమిని ఆక్షన్ వేసుకొని ఒక్కొక్క ఎకరం 40 కోట్లకు అమ్ముకునేందుకు ప్రభుత్వం కబ్జాకు పాల్పడిందని అంటున్నారు బాధితులు. ఖానామెట్ లో 27.79 ఎకరాల్లోని 9 ప్లాట్లను అమ్మేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అక్కడ కనిష్టంగా 70 గుంటలు మొదలుకుని ఒక ఎకరం 74 గుంటలు, గరిష్టంగా 3 ఎకరాల 9 గుంటలు… 3 ఎకరాల 10 గుంటలు మొదలుకుని 3 ఎకరాల 78 గుంటల విస్తీర్ణంతో మొత్తం 7 ప్లాట్లున్నాయి. వాటిని వచ్చే నెల 27న ఆక్షన్ నిర్వహించనున్నారు.