– దడ పుట్టిస్తున్న వైరస్
– దేశంలో నాలుగో కేసు
– డబ్ల్యూహెచ్వో హెల్త్ ఎమర్జెన్సీ
– అప్రమత్తమైన కేంద్రం.. ఉన్నతస్థాయి మీటింగ్
కరోనా దెబ్బకు దేశంలో ఎన్నో మారాయి. ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. సామాన్యుడు తీవ్రంగా నష్టపోయాడు. ఇప్పుడప్పుడే కోలుకోలేని పరిస్థితి. అయితే.. పరిస్థితులు సద్దుమణుగుతున్న ఈ సమయంలో మంకీపాక్స్ కలవరం మొదలైంది. ఇప్పటికే 75 దేశాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి.
అనేక దేశాల్లో వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది ఈ వైరస్. భారత్ లో నాలుగో కేసు కూడా నమోదైంది. ఢిల్లీకి చెందిన వ్యక్తికి నిర్ధారణ అయింది. అయితే.. అతను ఇటీవల హిమాచల్ ప్రదేశ్ మనాలిలో జరిగిన ఒక స్టేజ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది. దీంతో అందరిలో కలవరం మొదలైంది.
ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బాధితుడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు తెలిపారు.
మరోవైపు కేరళలో ఇప్పటికే మూడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈనెల 14న తొలి కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ నుంచి కన్నూర్ కు వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి 18న పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 22న మూడో కేసు బయటపడింది. ఇప్పుడు నాలుగోది.