తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ దోపిడీ రాజ్యమేలుతోంది. సర్కారు దావఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అక్కడి పరిస్థితులు మాత్రం వేరేగా ఉంటున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను మించి చికిత్సకో రేట్ ఫిక్స్ చేసి.. అందినంత దండుకున్నారు వైద్య సిబ్బంది. ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూనే.. పేదవారి దగ్గర చిల్లరకు ఆశపడుతున్నారు. నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ప్రాంతీయ వైద్యశాలలో వైద్య సిబ్బంది వసూళ్ల దందా తాజాగా బయటపడింది.ప్రసూతి సేవల కోసం వచ్చిన వారిని.. పైసలిస్తేనే పని అంటూ వేధిస్తున్నారు అక్కడి సిబ్బంది. సీజేరియన్ చేయాలంటే రూ. 5 వేలు చెల్లించాల్సిందేనని.. లేదంటే ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో దగ్గరలో మరో ప్రభుత్వ ఆస్పత్రి లేక.. ప్రైవేట్ హాస్పిటల్ ఎంత వసూలు చేస్తారో తెలియక అడిగినింత చేతిలో పెడుతున్నారు బాధితులు. తాజాగా ఓ గర్భిణీ ఈ విషయాన్ని బయటపెట్టడంతో.. అక్కడి అక్రమ దందా బయటకు వచ్చింది.
కమలానెహ్రూ ఏరియా హాస్పిటల్‌లో జరుగుతున్న ఈ వసూళ్ల విషయం గతంలోనే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. పద్దతి మార్చుకోవాలని సూచించినా.. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ అరవింద్ తన దందాను నిరాటంకంగానే కొనసాగిస్తున్నాడు. ఇలా గత 8 నెలల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీల నుంచి రూ. లక్షల్లో వసూలు చేసి ఉంటాడని తెలుస్తోంది. ఇంతా జరుగుతున్నా, ఎంత మంది ఫిర్యాదు చేస్తున్నా సూపరింటెండెంట్ భాను ప్రసాద్ ఇదంతా సాధారణమే అన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం.