ప్రాణాలు కాపాడుకుందామని వెళ్లారు. కాని అక్కడికి వెళ్లినందుకే ప్రాణాలు కోల్పోయారు. లక్షలు ఖర్చు పెట్టి.. తమవారు ఆరోగ్యంగా తిరిగొస్తారని బంధువులంతా ఆశగా ఎదురు చూశారు. కాని లక్షలు ఖర్చు పెట్టినందుకే ఆ ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. కరోనా కోరల నుంచి తప్పించుకుందామని చూస్తే.. అగ్నికీలలకు బలైపోయారు. నిర్లక్ష్యం ఖరీదు … 10 మంది ప్రాణాలకు పైనే. కాని ఆ నిర్లక్ష్యం ఎవరిది.. ఎంతమందిది?
విజయవాడ స్వర్ణపాలెస్ హోటల్లో అగ్నిప్రమాదం జరగడంతో 10మందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. రమేష్ హాస్పిటల్స్ వారు ఈ హోటల్ ను.. కోవిడ్ సెంటర్ గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 40 మందికి పైగా పేషెంట్లు ఇందులో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ మనకు ఎదురయ్యే ప్రశ్నలు ఒకటి.. అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకోలేనంతగా కట్టిన ఆ భవంతికి పర్మిషన్ ఎలా వచ్చింది.. రెండు.. సేఫ్టీ మెజర్స్ లేని హోటల్ ఎలా రన్ చేయగలుగుతున్నారు.. మూడు.. ప్రేవేటు హాస్పిటల్ కు హోటల్ ను కోవిడ్ సెంటర్ గా రన్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది.. నాలుగు.. ఇంత మంది పేషెంట్లు డబ్బులెక్కువ ఖర్చవుతున్నా అక్కడ ట్రీట్ మెంట్ తీసుకోవడానికి కారణమేంటి?
మొదటి రెండు ప్రశ్నలకు సమాధానం.. విజయవాడలోని చాలా బిల్డింగ్స్ ఇలాగే ఉంటాయి. ఎవరూ సరైన పర్మిషన్స్ అగ్నిమాపక శాఖ నుంచి తీసుకోరు. పాటించరు. ఎందుకంటే ఒకవేళ ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ గుర్తించినా నోటీసు మాత్రమే ఇవ్వగలరు.. మహా అయితే కోర్టుకు వెళితే.. కాసింత ఫైన్ కడితే చాలు. అందుకే ఎవరూ వాటిని పాటించరు.. అవి ఇరుకు సందులైనా.. మెయిన్ రెడ్లు అయినా.. ప్రముఖ సంస్థలు చందన బ్రదర్స్, ఆంజనేయ జ్యూయెలర్స్, ప్రముఖ కాలేజీలైన నారాయణ, చైతన్య సంస్థలు, స్వర్ణ ప్యాలెస్, స్వీట్ మేజిక్ లాంటివన్నీ అలా నోటీసులు అందుకున్నవాటిలో ఉన్నవే. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వారంతా పెద్దోళ్లు కదా.
ఇక మూడోది.. ప్రభుత్వం రమేష్ ఆస్పత్రికి పర్మిషన్ ఎలా ఇచ్చిందంటే.. ఇదొక్కటే కాదు.. మొత్తం 15 హోటల్స్ కు ఇలా వివిధ ప్రైవేటు ఆస్పత్రుల కింద పర్మిషన్లు ఇచ్చినట్లు స్వయంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. ఎందుకంటే.. ప్రభుత్వ ఆస్పత్రులు ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రులు కూడా నిండిపోయాయి.. దీంతో ఇంకా ప్లేస్ చాలక.. కరోనా పేషెంట్లను.. హోటల్స్ లో పెట్టడం మొదలెట్టాయి ప్రైవేటు ఆస్పత్రులు.. అందుకు ప్రభుత్వం సైతం పర్మిషన్ ఇచ్చేసింది.
ఇక నాలుగోది.. పేషెంట్లు ఎందుకు వెళ్లారంటే.. వేరే మార్గం లేక. ప్రభుత్వ ఆస్పత్రులు రష్ గా ఉండటం.. పైగా అక్కడ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో.. కాస్త డబ్బు పెట్టగలిగినవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతుంటే.. అక్కడ బెడ్స్ ఫుల్ అయిపోయాక.. ఇలా హోటల్స్ లో పెట్టి ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. పేషెంట్లు తప్పక చేరుతుంటే.. ప్రభుత్వం అన్నీ తెలిసి చోద్యం చూస్తోంది.ఒక మహమ్మారి లాంటి వ్యాధి కరోనా కబళిస్తుంటే.. ఇది ఒక ఎమర్జెన్సీ లాంటిది. అలాంటి సిట్యుయేషన్ లో .. ప్రైవేటు ఆస్పత్రులను, కోవిడ్ సెంటర్లుగా పెట్టడానికి ఉపయోగపడే బిల్డింగులను స్వాధీనం చేసుకుని స్వయంగా నిర్వహించాల్సింది పోయి ప్రభుత్వం.. ప్రైవేటువారి దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. ఇది మాత్రం దారుణం. ప్రైవేటువాడు వ్యాపారమే చేస్తాడు.. లాభమే చూస్తాడు. ప్రభుత్వం అలా కాదు కదా.. ఇక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా చేతులెత్తేయడం వల్లే ఈ పరిస్ధితి దాపురించింది. ఇప్పటికైనా.. ప్రభుత్వం ఆ పని చేస్తే.. రాష్ట్రమంతా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి సరైన చర్యలు చేపడితే.. కరోనాతో బాధపడుతున్న లక్షల మంది ప్రజలు దాని నుంచి బయటపడతారు.