లంచం.. అంచం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో లంచం లేకుండా ఏ పని ముందుకు కదలడం లేదంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. తంగళ్లపల్లి మండలం తాడూర్ ఏఈవో అజీజ్ ఖాన్.. అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది.
రైతులకు ఏ పనిచేయాలన్నా.. లంచం ఇచ్చుకోవాల్సిందేనంటున్నారు. రైతుబీమా, రైతుబంధు, పంట వివరాల నమోదు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్‌చేసి మరీ రైతులను పీల్చిపిప్పిచేస్తున్నాడంటూ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులిస్తే తప్ప పని జరగదంటూ తెగేసి చెప్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ రైతు తనపంటను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అజీజ్ ఖాన్‌ను కలిశాడు. అందుకు ఏఈవో 500 రూపాయలు లంచం అడిగాడు. కంగుతిన్న రైతు.. ఇదెక్కడి అన్యాయం సార్.. డబ్బు ఎందుకివ్వాలంటూ అమాయకంగా అడిగాడు. డబ్బు ఇస్తేనే పని.. లేదంటే లేదని ఖరాఖండిగా చెప్పడంతో చేసేదేమీలేక పోన్‌పే ద్వారా ఆన్‌లైన్‌లో పంపించాడు.
ఈ బాగోతాన్నంతా వీడియో తీసిన మరో రైతు.. సోషల్ మీడియాలోకి వదిలాడు. దీంతో ఆ లంచగొండి అధికారి బాగోతం బట్టబయలైంది. ఇది అతనికి కొత్తేం కాదని.. తన దగ్గరకు వెళ్లిన ప్రతీ రైతును ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేస్తారని ఆరోపిస్తున్నారు. ఏఈవో పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.