ప్రభుత్వమే కదా.. డబ్బులెక్కడికి పోతాయిలే అనుకున్నారు. ఎన్నికలొస్తున్నాయి.. అర్జెంటుగా చేయాలని అధికారులు తొందర పెట్టారు. ఆర్డర్లు లేకుండానే పని కానించేశారు. లక్షల పెట్టుబడి పెట్టి మరీ పనులు వేగంగా పూర్తి చేశారు. ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఆర్డర్ కాపీ ఏది? అసలు నిజంగా పని చేశారా లేదా? ఆ పని చూడాలి? ఇలాంటి ప్రశ్నలతో ఆ అధికారులే బిల్లులు చెల్లించకుండా తిప్పుకుంటుంటే తెల్ల మొహం వేయాల్సిన పరిస్ధితి వచ్చింది. మీరే కదా చేయమన్నారంటే.. ఏమో ఇప్పుడు అన్నీ ఉంటేనే పేమెంట్ లేదంటే లేదు..అని అదే అధికారి మొహం తిప్పుకుని చెబుతుంటే గుండెలు ఆగినంత పనవుతోంది.
గుంటూరు జిల్లాలో మొన్నే 67 ఏళ్ల మాజీ సర్పంచ్ .. టీడీపీ గ్రామ కమిటీలో పాల్గొని.. బయటకు రాగానే గుండెపోటుతో మరణించాడు. సమావేశంలో చర్చించింది.. ఉపాధి హామీ పనుల బిల్లుల గురించి. చనిపోయిన పెద్ద మనిషికి 30 లక్షల పైనే బిల్లు రావాల్సి ఉంది. అవి రావేమోనని చర్చ జరగడంతో.. టెన్షన్ తో గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఆయనే దాసి సుబ్బారావు. స్వస్థలం అగ్నిగుండాల గ్రామం, ఈపూరు మండలం, గుంటూరు జిల్లా.
ఉపాధి హామీ పథకం కింద పనులు రెండు రకాలు. ఒకటి లేబర్ మాత్రమే పని చేసేవి.. రెండోది మెటీరియల్ తో చేయగలిగేది. టీడీపీ ప్రభుత్వం ఈ నిధులను ఉపయోగించుకుని చాలా పనులే చేయించింది. ఎన్నికలకు ముందు వేగంగా పనులు చేయాలని ఒత్తిడి తెచ్చింది. పనులు తీసుకున్న కాంట్రాక్టర్లలో ఎక్కువమంది టీడీపీ వారే ఉన్నారన్నది వాస్తవమే. అధికారులు వారిని పరుగులు పెట్టించి పనులు చేయించారు. ఆఖరికి ఆర్డర్లు కూడా ఇవ్వకుండా హడావుడి చేశారు. తమ ప్రభుత్వమే మళ్లీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ తో పనులు పూర్తి చేశారు. కాని ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. కథ అడ్డం తిరిగింది.
టీడీపీ నేతల ఆర్ధిక మూలాలను నలిపిపారేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వీరిని మాత్రం ఎందుకు వదులుతారు. వదులుతారనుకోవడం.. పిచ్చితనం అవుతుంది. ఆ బిల్లులన్నీ చెల్లించొద్దని హుకుం జారీ చేశారు. పైగా కేంద్రం నుంచి 2000 కోట్ల నిధులు వచ్చినా.. కొత్త పనులు చేస్తే.. పాత బిల్లులు చెల్లించాల్సి వస్తుందని.. అసలు పనులే ఆపేశారు. మెటీరియల్ వర్కుల కింద కొత్త పనులు చేయకుండా ఆదేశాలిచ్చారు. కొత్త బిల్లులు ఇవ్వాలంటే.. పాత బిల్లులు క్లియర్ చేయాల్సి ఉంది కాబట్టి.. ఆ అవకాశం లేకుండా.. డబ్బులు డిపార్ట్ మెంట్ లోనే స్టాక్ పెట్టేసుకున్నారు తప్ప.. ఎవరికీ చెల్లింపులనేవి చేయనివ్వలేదు. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టిన వారంతా ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారు.
అదేమంటే.. ప్రభుత్వం ఆడిట్ చేస్తున్నామని అంటోంది. ఆ ఆడిట్ ఏధో తొందరగా పూర్తి చేసి.. చెల్లించాల్సినవారికి బిల్లులు వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. కాని మొత్తానికే బిల్లులు ఆపాలనుకుంటున్న ప్రభుత్వం… నిదానంగా తన పని తాను చేసుకుపోతోంది. పనులపై పెట్టుబడులు పెట్టిన వారంతా గ్రామాల్లో టెన్షన్ తో గడుపుతున్నారు. కొందరైతే ఆ బిల్లులపై ఆశలు వదిలేసుకున్నారు కూడా.
ALSO READ: