– తోకముడిచి.. బిచానా ఎత్తేసిన ల్యాండ్ మాఫియా
– రెండు నెలల హైడ్రామాకు తెర
– అడ్డాకల్ లో ఫలించిన ‘నేనుసైతం’ పోరాటం
– ‘నేనుసైతం’ పోరాటాన్ని వెలుగులోకి తెచ్చిన తొలివెలుగు
సొమ్ము ఒకరిది… సోకు మరొకరిది అన్న నానుడిని నిజం చేస్తూ ప్రజల అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి.. ఫామ్ ప్లాట్స్ ల పేరిట కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నించిన ల్యాండ్ మాఫియా ఆగడాలకు చెక్ పడింది. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే దర్జాగా దోపిడీ చేసేందుకు పాలమూరు జిల్లాకు వచ్చిన పట్నం ల్యాండ్ మాఫియాకు చుక్కలు చూపించి మీ ఆటలు ఇక్కడ సాగవు… అమాయక ప్రజలకు మేం అండగా ఉంటామని ముందుకు వచ్చింది నేనుసైతం స్వచ్ఛంద సంస్థ. అడ్డాకల్ భూ దందాపై తనదైన శైలిలో పోరాటాన్ని ప్రారంభించి.. మాఫియా ఆగడాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు రిజిస్ట్రేషన్ చెయ్యమని ప్లెక్సీ ఏర్పాటు చేయడంతో అడ్డాకల్ ల్యాండ్ మాఫియాకు చెక్ పడింది. నేనుసైతం పోరాటాన్ని తొలివెలుగు.. వెలుగులోకి తీసుకురావడం.. అధికారులు స్పందించడంతో గత రెండు నెలల హైడ్రామాకు ఆదివారంతో తెరపడింది.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం శగాపూర్, గుదిబండ గ్రామ పరిధిలో 69 ఎకరాల్లో ల్యాండ్ మాఫియా ఫామ్ ప్లాట్స్ ల పేరిట చేస్తున్న అక్రమ దందాపై నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ గత నెల 29న పోరాటాన్ని ప్రారంభించారు. ఈ ల్యాండ్ మాఫియా పోరాటం గత 10 రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇదిలాఉంటే తమకేది పట్టనట్టుగా తిరిగి ఈనెల 1న హ్యాపీ ఫామ్ రిసార్ట్ సభ్యులు తమ అక్రమ భూదందా కొనసాగిస్తూ ప్రజలకు ఫామ్ ప్లాట్లను అమ్మేందుకు ప్రయత్నించారు. సంబంధిత భూమిలో టెంటు వేసి హల్ చల్ చేస్తూ.. మళ్ళీ అక్రమ వ్యాపారానికి తెర లేపారు. దీంతో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తొలివెలుగు కూడా ప్రవీణ్ కుమార్ చేస్తున్న పోరాటాన్ని హైలెట్ చేస్తూ కథనాలు ఇచ్చింది. ఈ అక్రమ భూ దందాను రెవెన్యూ , పోలీస్ యంత్రాంగం అడ్డుకుంది. దీంతో తోక ముడిచిన మాఫియా.. బిచానా ఎత్తేసింది. గత రెండు నెలలగా అడ్డాకల్ లో టెంట్లు, కార్లు, వందలాది వినియోగదారులతో నెలకొన్న హైడ్రామాకు తాజాగా తెర పడింది.
అడ్డాకల్ మండలం శగాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 123, 125, 126, 127, 144, 147, గుదిబండ గ్రామ పరిధిలోని 91, 92 సర్వే నెంబర్లలో మొత్తం 69 ఎకరాల భూమిలో ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమ దందాను అడ్డుకున్నామని నేనుసైతం అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత 10 రోజులుగా సంచలనంగా మారిన ఈ భూ దందాకు చెక్ పడిందని, ల్యాండ్ మాఫియాపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడతామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ, నాలా, డీటీసీపీ, ఇతర సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే.. చట్టాలకు వ్యతిరేకంగా అడ్డాకల్ లో ఫామ్ ప్లాట్ ల పేరిట అగ్రికల్చర్ భూమిని అక్రమంగా అమ్మేందుకు చూశారని.. ఇది చట్ట విరుద్ధమని అన్నారు. ఇప్పటివరకు వినియోగదారుల నుండి అడ్వాన్స్ ల పేరిట వసూలు చేసిన మొత్తం డబ్బులను వెంటనే బాధితులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మాఫియా వెనకున్న పెద్ద తలకాయలను వదిలే ప్రసక్తే లేదన్నారు ప్రవీణ్. అధికారులు ల్యాండ్ మాఫియాపై వెంటనే సమగ్ర విచారణ జరిపి.. ఈ భూ దందాతో సంబంధం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.