నరసింహ రెడ్డి
జర్నలిస్ట్
గత 40 రోజులుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితులు గమనిస్తుంటే నా దేశానికి ఏ ఆపద వచ్చిన ప్రజలు సమిష్టిగా ఎదురుకుంటారు అనే నమ్మకం వచ్చింది. తాము ఎన్ని కష్టాలు పడ్డ దేశం కోసం అన్ని భరిస్తారు. వైద్య శాఖ అధికారులు కనీసం మనస్ఫూర్తిగా గాలి కూడా పీల్చుకోకుండా, ప్రాణాలను పణంగా పెట్టి, సొంత బిడ్డలను కనులారా చూసుకోకుండా దేశ రక్షణకు పనిచేస్తున్నారు, ఇలాంటి సేవ చేయడం మా అదృష్టం అన్న డాక్టర్లు కూడా ఉన్నారు, వైద్యం చేస్తూ అదే వైరస్ సోకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక పోలీస్ లు కుటుంబాలను వదిలి 24 గంటలు రోడ్ల పై దేశం కోసం పనిచేస్తున్నారు. కొన్ని సంఘటనలు కన్నీరు తెప్పించాయి, పోలీస్ లు ఇంటికి వెళ్లిన కన్న బిడ్డలను సైతం దూరం నుంచి చూసే పరిస్థితి, జైల్లో ములాఖత్ కు వెళ్లిన వాళ్ళను ఖైదీలు చూసినట్లుగా కుటుంబ సభ్యులను చూసినప్పుడు ఆ పోలీస్ లు అనుకున్నది దేశం కోసం సేవ చేసే అవకాశం వచ్చిందిలే అని సంతోషపడ్డారు. ఇక మీడియా వాళ్ళ పరిస్థితి మరింత ఘోరం. వైద్యశాఖ, పోలీస్ లకు ఉద్యోగ భద్రత ఉంది వీళ్లకు అది కూడా లేదు, రేపు అనేది గ్యారంటీ లేదు ఆయిన తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టి కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వర్ణనాతీతం, వీళ్ళందరు ప్రాణాలకు తెగించి కష్ట కాలంలో ప్రజలకు సేవ చేస్తున్నారు, దేశ సేవ కోసం అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
ప్రజలు వలస కూలీలు చూపిన స్ఫూర్తి అద్భుతం. పాలకులు ఒక్క మాట చెప్తే ఎందుకు ఏంటి అని అడగలేదు, తల్లిదండ్రులు చెప్తే చిన్నపిల్లలు విన్నట్లు పాలకులు ఏది చెప్తే అది చేశారు. ఈరోజు నుంచి మీరు ఇంట్లో కూర్చోండి అంటే, 40 రోజులకు పైగా ఇంట్లో కూర్చున్నారు. తినడానికి ఉందా లేదా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్న ఆ కష్టాలు వాళ్లే పడ్డారు తప్ప ప్రభుత్వాలను ఎదురు ప్రశ్నించలేదు, రోడ్లమీదికి రాలేదు. వలస కూలీలా బ్రతుకులు దుర్భరం, అయిన వాళ్ళు తినడానికి తిండి లేక వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.
ఇదంతా ఒక స్ఫూర్తి. అవును ప్రజలు ఇండ్లలో ఉండడం కరోనాను ఎదురుకోవడం అనేది ప్రభుత్వాల ఘనత కాదు ప్రజల స్ఫూర్తి. తాము చెప్పినట్లుగా విన్న ప్రజల ను ఈ ప్రభుత్వాలు మోసం చేశాయి. ప్రజల స్ఫూర్తిని ఈ ప్రభుత్వాలు దెబ్బకొట్టాయి. తమ ఆదాయం కోసం పిచ్చి నిర్ణయాలతో ప్రజల ఐక్యత ను నాశనం చేసాయి ఈ ప్రభుత్వాలు. పాలకుల ఒక నిర్ణయం ప్రజల జీవితాలను మార్చేస్తాయి, అది మంచి వైపుకు కాదు చెడు వైపుకు. మీరు చప్పట్లు కొట్ట మంటే కొట్టారు, మీరు దీపాలు వెలిగించమంటే వెలిగించారు, 130 కోట్ల మంది అన్ని పక్కన పెట్టి మీరు చెప్పింది చేశారు. బహుశా ప్రపంచం లో ఏ దేశంలో కూడా ఇంతటి స్ఫూర్తి ఉండకపోవచ్చు ఇది పాలకుల గొప్పతనం కాదు ప్రజల దేశభక్తి.
ఇంతమంది ఇన్ని రకాలుగా సహకరిస్తే, ఇన్ని వర్గాలు ఇన్ని రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొని, త్యాగాలు చేసి ప్రభుత్వాలకు సహకరిస్తే ప్రభుత్వాలు చేసిందేమిటి సర్వనాశనం. ముందు చూపులేని ఒకే ఒక్క దిక్కుమాలిన నిర్ణయంతో యావత్ దేశాన్ని కరోనా ఒడిలోకి నెట్టేసినట్టైంది. భవిష్యత్తులో ప్రభుత్వాలు చెప్పే మాటలు ప్రజలు ఎందుకు వింటారు, వాళ్ళు అన్ని కష్టాలు భరిస్తే ప్రభుత్వాలు మాత్రం తమ ఆదాయాన్ని ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకోలేక పోయాయి. మాకు లిక్కర్ పై వచ్చే ఆదాయం పోతుంది ప్రజలే మాకు సహాయం చేయాలి అని మీరు ఒక్క పిలుపు ఇచ్చిఉంటే అది కూడా చేసేవాళ్లేమో ప్రజలు ఎందుకంటే వాళ్లలో అంతటి స్ఫూర్తి ఉంది.
ప్రపంచం భారత్ వైపు చూస్తోంది, దేశం తెలంగాణ వైపు చూస్తోంది అన్న డబ్బకొట్టుకునే ప్రభుత్వాధినేతల్లారా, నిజమే నిన్నటి ఒకే ఒక్క సంఘటనతో యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా చేసారన్నది నిజం. ఇక మీ మీద ప్రజలకు నమ్మకం పోయేలా చేశారు, దీనికోసమా మా ప్రాణాలకు సైతం తెగించాము అని పోలీస్ లు, వైద్యులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికులు అనుకునేలా మీ ప్రవర్తన ఉంది. నిన్నటి దాకా పోలీస్ లకు భయపడి లాక్ డౌన్ పాటించిన పోకిరీలకు ఈరోజు అదే పోలీస్ లు దగ్గర ఉండి మందు తాగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. గొప్ప పాలకుల ఒక్క ఐడియా, దేశ చరిత్రనే మారుస్తుంది, ఇలాంటి పాలకుల ఒక్క ఐడియా దేశాన్ని పాతాళంలోకి తీసుకెళ్తుంది.