ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో బడ్జెట్‌కు ముందు ప్రధాని మోడీ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేశంలోని పలువురు ఆర్థిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఆయన సంప్రదింపులు జరపనున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, దాని స్థితిగతులు, వేగవంతమైన వృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ప్రముఖ వ్యవసాయ నిపుణులు అశోక్ గులాటి, ఐఐఎం ప్రొఫెసర్ సంకేత్ మహాపాత్ర, అసిమా గోయల్, సుర్జిత్ భల్లా వంటి ప్రముఖులతో ప్రధాని మోడీ చర్చించనున్నారు.
ఓ వైపు ఆర్ధిక మందగమనం, మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభ భయాలు వెంటాడుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ధిక వృద్ధి అంచనాలు ఏడు శాతం దిగువకు పడిపోయాయి. ఇలాంటి నేపధ్యంలో ఆర్థిక వృద్ధిని గాడిన పెట్టే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా నిపుణులతో కేంద్రం సంప్రదింపులు జరపనుంది.
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి బడ్జెట్ ఇదే కావడంతో దీని రూపురేఖలపై అందరూ ఆసక్తి చూస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎలాంటి సాయం చేస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు.