కార్మిక సంఘాలు రేపటి నుంచి జరప తలపెట్టిన 24 గంటల దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కనీస స్థిర వేతనాల కోసం సి.ఐ.టి.యు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా 9 కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి. బీజేపీ విధానాల వల్ల సంఘటిత, అసంఘటిత రంగాల్లోని 80 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని…దీని వల్ల దేశంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుందని సి.ఐ.టి.యు వెల్లడించింది.
అయితే సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడమే గాక..క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు, నిరసనల్లో పాల్గొనడం నిషేధమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.