మణికొండ జాగీర్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 1654 ఎకరాల భూమి సర్కార్ కు దక్కినట్లయింది.
ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇంతకుముందు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాజాగా ఆ తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2016 నుంచి ఈ భూముల కేసు సుప్రీంకోర్టులో నలుగుతోంది. 1654 ఎకరాల 32 గుంటల భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డు… వక్ఫ్ ట్రైబ్యునల్ మద్దతుతో కోర్టుకెక్కింది. అయితే సుప్రీం తాజా తీర్పుతో ఆ భూమిపై ప్రభుత్వానికి సర్వ హక్కులు దక్కాయి.
దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు మొత్తం 1,654 ఎకరాలను ప్రకటిస్తూ 2006లో వక్ఫ్ బోర్డు జారీచేసిన ఎర్రాటా నోటిఫికేషన్ వివాదంగా అయింది. అయితే అక్కడ కేవలం ఒక ఎకరం మాత్రమే దర్గాకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ భూముల్లో కొంత భాగం అప్పటికే 2001లో ఐఎస్‌బీకి, 2004 తర్వాత ఎమ్మార్ ప్రాపర్టీస్, ఇతరులకు కేటాయించారు. అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కేటాయింపులు చేశాయి. వీటిని దేవాదాయ శాఖ భూములుగా భావించిన ప్రభుత్వం.. ఐటీ సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీల కోసం భూములను విక్రయించడం, కేటాయింపులు చేయడం చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ఆ భూములు దర్గాకు చెందినవని వాదించింది. అవి దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలీకి దాదాపు 150 సంవత్సరాల క్రితం ప్రసాదించిన ఆస్తి అని తెలిపింది. ఇందుకు వక్ఫ్ బోర్డు ట్రెబ్యునల్ మద్దతు తెలిపింది. దీంతో హైకోర్టు దగ్గరకు ఈ పంచాయితీ వెళ్లింది. కోర్టు వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది. చాలా కాలం పాటు వాదనలు జరిగాయి. తాజాగా ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని సుప్రీం ధర్మాసం తేల్చిచెప్పింది.