ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న డిమాండ్ ఎందుకు వచ్చింది, దానికి కారకులు ఎవరు అని పరిశీలిస్తే… నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో రోడ్లను జాతీయం చేస్తూ చట్టం తేవడంతో పాటు అన్ని రాష్ట్రాలలో రోడ్డు రవాణా సంస్థ లను ఏర్పాటు చేస్తూ అందులో కేంద్రం వాటా ముప్పై ఒక్క శాతం వరకు వుండే విధంగా చట్ట రూపకల్పన చేసారు. నాటినుండి నేటివరకు ప్రజల సేవలో ఆర్టీసీ పని చేస్తూ వస్తోంది. కొన్ని రూట్స్ లలో లాభాలు వచ్చినా నగర ప్రాంతాలలో నష్టాలతో బస్సులు నడుపుతుంది సంస్థ అయినా ప్రజా రవాణా సంస్థగా గొప్ప పేరు తెచ్చుకుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలకు సేవ చేసే సంస్థగా ఉన్న ఆర్టీసీకి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అయితే కాల క్రమంలో ప్రభుత్వాలు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ని స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోకుండా అడ్డుపడుతూ వచ్చాయి.
ఆర్టీసీని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోవడం మొదలు పెట్టారు. ఛార్జీలు పెంచుకునే స్వేచ్ఛను సంస్థ యాజమాన్యానికి ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వివిధ వర్గాల వారికి రాయితీలు ప్రకటించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో రాజకీయ ప్రయోజనాలు పొందారు కాని క్రమక్రమంగా అయా ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్న రాయితీ బకాయిలు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. అవి కోట్లలో పేరుకొని పోతూ వచ్చాయి. మరోవైపు డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతూ పోయాయి. అయినా బస్సు ఛార్జీలు పెంచలేదు. ఎందుకంటే ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకునే శక్తిని సంస్థ కోల్పోయింది.
ప్రభుత్వం చెప్పింది చేసే సంస్థగా మారిపోయింది ఆర్టీసీ. ఛార్జీలు పెంచితే అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకత వస్తుంది అనే భావంతో ఎప్పటి కప్పుడు ఛార్జీలు పెంచే ఆలోచనలను ప్రభుత్వాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. దీంతో కూడా ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతూ వస్తుంది. నష్టాల్లోకి నెట్టబడింది. ఒకవైపు ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్న సబ్సిడీలు, మరోవైపు ఛార్జీలు పెంచుకునే అవకాశం లేకుండా పోవడం, డీజిల్ రేట్లు పెరుగుతూ పోవడం ఇలా ఒకదానికి ఒకటి తోడయ్యి వెరిసి నష్టాలకు కారణం అయింది. ఈ నష్టాలకు కార్మికులు కారణం కాదు. కేవలం ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలకు ప్రజా రోడ్డు రవాణా సంస్థ ను వాడుకోవడం అని చెప్పకతప్పదు.
కార్మికులు కష్టపడి మైలేజ్ ను పెంచుకోవడం ఓ అర్(అకుపెన్సి రేటు)పెంచుకోవడం లక్ష కిలో మీటర్లు తిరిగిన బస్సులను కూడా కష్టం అనుకోకుండా కార్మికులు తిప్పుతూ వస్తున్నారు. ప్రమాదాలు లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడం ఇలా ఆర్టీసీ అంటే ప్రజలలో విశ్వసాని పెంచారు. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సుల ద్వారా గ్రామీణ ప్రజలకు దగ్గరయింది. కార్మికుల శ్రమ ఫలితంగా సంస్థకు అనేక అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను కూడా ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. చివరికి ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సిన బకాయిలు పేరుకొని పోవడం, ఛార్జీలు పెంచుకోవడానికి సంస్థకు ప్రభుత్వాలు అవకాశం ఇవ్వకపోవడంతో సంస్థ మనుగడ కష్టం అయ్యింది.
జీతాలు కూడా చెల్లించలేని స్థితికి ఆర్టీసీ నెట్టబడింది. దీంతో ప్రభుత్వాలు చేతులేత్తేసి పి ఎఫ్ డబ్బులు వాడుకోండి, కార్మికులు దాచుకున్న కోపరేటివ్ డబ్బులు వాడుకోండి, రిటైర్ మెంట్ సమయంలో కార్మికులకు ఇచ్చేందుకు వుంచిన రిటైర్మెంట్ బెన్ ఫిట్ నగదు నిల్వలను వాడుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వాలు కనీసం కేంద్ర రాష్ట్ర టోల్ గేట్ మినహాయింపులు లను కూడా ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ కి ఇప్పించలేకపోయారు. టోల్ రూపంలో కూడా ఆర్టీసీ మీద భారం పడింది. ఇలా అన్ని వైపులనుండి ఆర్టీసీపైన తలకుమించిన భారం పడింది. దీంతో కొల్కొలేని పరిస్థితికి ఆర్టీసీ నెట్టబడింది. దిక్కులేని పరిస్థితిలో సంస్థ ఉంది.
ఈ నేపథ్యంలో సంస్థ మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో కార్మికులు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా చేసింది ప్రభుత్వం. సబ్సిడీలు సంస్థ మీద రుద్దుతోంది. ప్రభుత్వం డీజిల్ రేట్లు పెరిగినా ఛార్జీలు పెంచుకోకుండా అడ్డుపడుతుంది. ప్రభుత్వం ఇలా అన్ని ప్రభుత్వమే చేస్తునప్పుడు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్పేమిటి అంటున్నారు కార్మికులు. సంస్థ మంచిగా నడిచినప్పుడు అన్ని విషయాలలో జోక్యం చేసుకొని సంస్థ మనుగడను దెబ్బతీసి ఇప్పుడు మేము విలీనం చేసుకోమని అంటే ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. నష్టాలకు మీరే కారణం కాబట్టి మీరే సంస్థను విలీనం చేసుకొని, నడపండి అంటున్నారు. ఈ రోజు కోర్టుకి సమర్పించిన ప్రమాణ పత్రంలో సంస్థ అప్పులలో కురుకోనిపోయింది అని చెప్పారు. పి ఎఫ్ డబ్బులు, కోపరేటివ్ డబ్బులు ఇలా అన్నిటిని వాడుకుంది సంస్థ అని కోర్టుకు ఇచ్చిన పత్రంలో చెప్పారు. ఈ నిధులు ఎవరు చెపితే ఎవరు వాడారు, ఎందుకు వాడారు, సంస్థకు పూర్తి స్థాయి యాజమాన్యం ఉందా… ఉంటే అది పని చేస్తుందా, బోర్డు ను ఎందుకు నియమించలేదు, సంస్థకు ఈ డబ్బులు వాడుకునే అధికారం ఉన్నప్పుడు ఛార్జీలు పెంచుకునే అధికారం లేదా ఉంటే ఎందుకు ఛార్జీలు పెంచలేదు, ఛార్జీలు పెంచకుండా పి ఎఫ్ డబ్బులు ఎందుకు వాడినట్లు, పి ఎఫ్ డబ్బులు, ఇతర డబ్బులు వాడుకునేందుకు ఎం డి కి ఎవరు అధికారాలు ఇచ్చారు ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం కావాల్సి ఉంది. ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఆర్టీసీని వాడుకొని ఇప్పుడు కార్మికులను సంస్థను బజారునపడేసిందని కార్మికులు వాపోతున్నారు.