కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని, అందుకు వారు అందిస్తున్న సహకారం..ప్రేమే నిదర్శనమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించినా అది ప్రజారోగ్య పరిరక్షణ కోసమేనని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు హేచరీస్ సంస్థ సహకారంతో గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవాడలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో తొమ్మిది రోజులు లాక్‌డౌన్ ఉందని, ఇదే స్ఫూర్తితో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. కరోనాపై పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.