– కల్లాల్లో ధాన్యం..
– రైతన్నకు ముసురు భయం
– పూర్తిగా తెరుచుకోని ఐకేపీ సెంటర్లు
– తక్కువ రేటుకే అమ్మకాలు
– అన్నదాతల కష్టం.. మిల్లర్ల పాలు
యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పింది. కానీ.. వరి మాత్రమే పండే ప్రాంతాల్లో వేరే పంటకు అవకాశం లేక చాలామంది రైతులు అదే పంట వేశారు. తమను కాదని పంట ఎలా వేస్తారన్న కోపమో ఏమోగానీ.. మొదట్నుంచి రైతులపై కేసీఆర్ సర్కార్ తీరు అనుమానంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం మొత్తం కొనేందుకు అవసరమైన మొత్తం.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. కానీ.. కేంద్రమే కొనుగోలు చేయాలని ధర్నాలు అన్నారు.. దీక్షలు చేశారు.. యుద్ధం పేరుతో ఢిల్లీ వరకు వెళ్లి డ్రామాలు చేశారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజానికి కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రాజకీయ అవసరాల కోసం దీన్ని వాడుకోరని అంటున్నాయి.
రా రైస్ మాత్రమే ఇస్తామని సంతకం చేసి.. తర్వాత యూటర్న్ తిరిగిన కేసీఆర్ తీరును కేంద్రం కూడా గట్టిగానే తిట్టిపోసింది. చివరకు చేసేది లేక.. ధాన్యం అంతా తామే కొంటామని ప్రకటించారు కేసీఆర్. ఇంకేముంది.. రైతుబాంధవుడు.. రైతుప్రేమికుడు అంటూ టీఆర్‌ఎస్ వర్గాలు ఆయన్ను ఆకాశానికెత్తేస్తూ కటౌట్లు.. పాలాభిషేకాలు.. ఇలా మామూలు ప్రచారం చేయలేదు. తీరా చూస్తే పూర్తిస్థాయిలో ఐకేపీ సెంటర్లు తెరవలేదు. దీంతో కొనుగోళ్లలో జాప్యం పెరిగింది. దాని ఫలితంగా అన్నదాతకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు ప్రకటనకు ముందే కొంత వరకు వడ్లు నష్టానికే అమ్మేసుకున్నారు అన్నదాతలు. కేసీఆర్ ప్రకటన చేశాక మిగిలిన వారన్నా లాభాలు ఆర్జిస్తారా? అంటే అదీ జరగలేదు. కొనుగోళ్ల జాప్యంతో కొంత పంటను.. దళారులకు తక్కువ రేటేకే అమ్మేశారు అన్నదాతలు. ఇక మిగిలిన ధాన్యాన్నన్నా త్వరగా సేకరిస్తారా? అని రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. కానీ.. కేసీఆర్ కరుణించలేదు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టు.. అకాల వర్షం వచ్చి పడింది. దీంతో ఉన్న ధాన్యం తడిసిపోయింది.
“కల్లాల్లో ధాన్యం రాశులు.. రైతుల కళ్లల్లో కన్నీళ్లు” రెండు ముక్కల్లో ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. “గుబులు రేపుతోన్న మొగులు.. కళ్లల్లో నీళ్లు, కల్లాల్లో ధాన్యం.. సర్కారు కొనదు. దళారీ మద్దతు ధర ఇవ్వడు. అగ్గువకైనా అమ్ముకోకపోతే తన కష్టం వర్షం పాలవుతుందేమోనన్న భయం రైతుది. ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకోవడానికి సిగ్గనిపించడం లేదా కేసీఆర్?” అని ప్రశ్నించారు.
రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. వర్షం దెబ్బకు చాలామంది రైతులు తక్కువ ధరకే పంటను అమ్మేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లుల యజమానులు కుమ్మక్కై దోసుకుంటున్న పరిస్థితి. చాలా చోట్ల మిల్లర్లు చెప్పినట్లుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారు చెప్పినట్లుగా ధాన్యం సేకరణ సాగుతోందని రైతులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎంత చెప్పినా కూడా రైతులు వరి వేశారన్న కోపం ఏమన్నా కేసీఆర్ మనసులో పెట్టుకుని వ్యవహరిస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.