మా ఓటరు గుర్తింపు కార్డు కావాలండి అంటూ ఓ మహిళ గ్రామ సచివాలయానికి వచ్చింది. వెంటనే ఆ గ్రామ వాలంటీరు లేచి వచ్చాడు.. మీది ఈ ఊరేనా.. ఎప్పుడూ చూడలేదే అంటూ నస మొదలెట్టాడు. ఇంతలో మరో వలంటీరు వచ్చి ఆవిడ నా వార్డే. డోర్ నెం.. నేను రమ్మన్నాను చెప్పిందామె. అవునా.. నీకు తెలియదులే గాని.. మేమొకపారి ఎంక్వయిరీ చేయాలే.. తర్వాత ఇస్తాంలే.. అని చెప్పి పంపేశాడు.
అదేంటని అడిగితే.. నీకు తెలియదా.. ఆళ్లు మన పార్టీ కాదు. తెలియకపోతే మమ్మల్ని అడుగు సీరియస్ అయ్యాడు ఆ మహిళా వాలంటీరు మీదు. ఇది ఇప్పుడు గ్రామాల్లో నడుస్తున్న తంతు. జన్మభూమి కమిటీలతో తెలుగుదేశం ఏం చేసిందో.. ఇప్పుడు వైసీపీ కూడా గ్రామ వాలంటీర్లతో అదే పని చేస్తోంది.
మనోళ్లు ఎవరు.. పరాయి పార్టీవాళ్లు ఎవరు.. ఏరేస్తున్నారు. పథకాలన్నీ వీరి చేతుల మీదే నడవాలి. కొందరికి ఇచ్చినట్లే.. మరికొందరికి ఆపేస్తున్నారు. పైన జగన్మోహన్ రెడ్డి గారు.. లబ్దిదారులెవరో గుర్తించండి.. మళ్లీ అప్లికేషన్ పెడితే చూడండి.. ఎవరూ మిస్ కావద్దని చెబుతున్నారు. మరి వెనక్కి తిరిగి ఏం చెబుతున్నారో తెలియదు గాని.. గ్రామాల్లో గోలగోలగా ఉంది. పంచాయితీ ఎన్నికలనాటికి అన్ని గ్రామాల్లో ప్రత్యర్ధి పార్టీలకు చెందినవారు ఎవరైనా సరే.. అయితే లొంగాలి.. లేదా కుంగాలి.. ఇదీ ఫార్ములా.
గ్రామ వాలంటీర్లలో అత్యధిక శాతం వైసీపీ వారే అని ఏకంగా ఆ పార్టీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డిగారే సెలవిచ్చారు. తక్కువ జీతం అయినా గాని కమిటెడ్ గా పని చేయడానికొచ్చారు. మా పార్టీవాళ్లంతా ఉంటే తప్పేంటి అని స్వయంగా మంత్రులే ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం సోషల్ ఆడిట్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇప్పుడీ సోషల్ ఆడిట్ తోనే అసలు కథ మొదలవుతుంది. ఎవరెవరిని ఏరేయాలి.. ఎవరెవరిని ఉంచాలి.. ఎవరు బతిమలాడుకుని సైడు మారుస్తారో.. వారి వరకు మినహాయింపు. ఇదే తంతు నడవబోతుంది.
అంతేకాదు.. పొరపాటున వాలంటీరుకు తెలియక వైసీపీవారిని ఎవరినైనా ప్రశ్నలు వేశారో.. ఇక వారి పని అయిపోయినట్లే. అయితే మానేసి అయినా వెళ్లిపోవాలి.. లేదంటే చెంపలేసుకుని క్షమాపణలు అడగాలి. ఇలాంటి ఘటనలు కూడా రాష్ట్రంలో అక్కడక్కడా జరుగుతున్నాయి.
సోషల్ ఆడిట్ అనేకన్నా.. దానిని వైసీపీ ఆడిట్ అనటం బెటరని.. త్వరలోనే అందరికీ అర్ధమవుతుంది. మరి జనానికి అర్ధమవుతుందో.. అర్ధం కావడానికి టైమ్ పడుతుందో..వేచి చూడాలి అంటున్నారు టీడీపీ శ్రేణులు.
నవరత్నాలన్నీ అమల్లోకి వచ్చేసరికి దాదాపు జనవరి దాటుతుంది. అప్పటికి గాని అసలు లెక్కలు తేలవు. ఎవరికి ఆపేశారనేది కూడా అప్పుడే తెలుస్తుంది. అప్పటివరకు అప్లికేషన్లు పెట్టండి.. వెరిఫికేషన్ చేయండి.. అందరికీ ఇవ్వండి వంటివన్నీ మనకు వినపడుతూనే ఉంటాయి నిట్టూర్చుతున్నారు.