డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం శనివారంతో ముగిసింది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. మహేందర్ రెడ్డి ఐపీఎస్ గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీస్ శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
ఈ సందర్భంగా కొత్త డీజీపీ అంజనీకుమార్ మాట్లాడారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తీసుకురావడానికి మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన తీసుకువచ్చిన సంస్కరణలను కొనసాగిస్తానని తెలిపారు. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు చెప్పారు. ప్రజల భద్రతకి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు అంజనీకుమార్.
డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఆయన.. ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారని అన్నారు. ఎన్నో రకాలుగా మహేందర్ రెడ్డి తనకు ఆదర్శమని చెప్పారు. ప్రభుత్వం పోలీస్ శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని.. కేసీఆర్ ముందుచూపు వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు.
సాంకేతికతను పోలీస్ శాఖకు జోడించడంలో మహేందర్ రెడ్డి చొరవ అభినందనీయమన్నారు అంజనీకుమార్. ప్రతి పౌరుడిని పోలీస్ అని చెప్పారని.. మహేందర్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానని స్పష్టం చేశారు.