రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్ సందర్బంగా గవర్నర్ తమిళి సై రాజభవన్ లోని ప్రజా దర్బార్ లో కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరిపారు.
ఈ వేడుకల్లో గవర్నర్ తమిళి సై, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమిళి సై తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని గవర్నర్ తమిళి సై ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు సకల సౌకర్యాలు కలిసి రావాలని తమిళి సై కోరారు. గత ఏడాది కరోనా అనేక రకాల చేదు అనుభవాలు మిగిల్చిందన్నారు. మన దేశం ఉపాధి రంగం, ఆర్థిక రంగంలో ముందు ఉందని తెలిపారు. చైనా సేఫ్ లేదు.. కానీ మనం సేఫ్ ఉన్నాం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. 81 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తుందని.. ఆకలితో ఎవ్వరూ ఇబ్బంది పడొద్దన్నారు.
కేవలం వ్యాక్సినేషన్, మెడిసిన్స్ ద్వారానే 45 లక్షల మందిని కొవిడ్ కాలంలో బతికించుకున్నామని మెడికల్ మ్యాగ్జిన్ ప్రకటించిందని చెప్పారు. కరోనా కాలంలోనూ అందరం సంతోషంగా ఉన్నామంటే అది కేవలం మనం తీసుకున్న జాగ్రత్తల వల్లేనని గుర్తు చేశారు. కరోనాపై కేంద్ర ప్రభుత్వ చొరవలను ఐక్య రాజ్య సమితి కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు.