తెలంగాణ రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తమిళి సై పొంగలి అన్నం వండారు. మంచి పొంగల్, సంతోష పొంగల్, ఆరోగ్య పొంగల్, జీ 20 పొంగల్ వండానని ఆమె చెప్పారు.
అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల మలక్ పేట ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమని అన్నారు. ఈ మరణాల విషయంలో ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు. అందుకే ఆ ఆస్పత్రికి వెళ్లాలని అనుకుంటున్నాని తెలిపారు.
గతంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలన్నారు. వైద్యరంగంలో మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు, కానీ ఇంకా మెరుగు పరచాలని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లులు పెండింగ్ కాదు, పరిశీలనలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివాదాలతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన అని చెప్పారు. ఈ తరహా విధానాల విషయంలో గతంలోనూ న్యాయస్థానాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయని ఆమె అన్నారు. దీంతో ఆమె మాటలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.