దేశంలో హిందూత్వకు ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. హిందూత్వ నినాద ప్రచారం దేశ వ్యాప్తమవుతోంది. ఉజ్జయినిలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దీన్ని నిరూపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని, అలాగే కాశీలో విశ్వనాధ్ ధామ్ భారత సంస్కృతికి ప్రతీకగా మారుతోందని ఆయన అన్నారు. సోమనాథ్, కేదార్ నాథ్, బద్రీ నాథ్ పుణ్యక్షేత్రాల అభివృద్ధి రికార్డు స్థాయిలో జరుగుతోందని ఆయన చెప్పారు. నిన్న ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆధ్యాత్మిక ప్రాంతాల శోభను పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ఉజ్జయిని కేవలం భారత భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, ఇది దేశ గడ్డకు కేంద్రం కూడానని ఆయన పేర్కొన్నారు. ప్రతిదీ సూపర్ నేచురల్, అసాధారణం, నమ్మశక్యం కాని వాస్తవం అని మోడీ వ్యాఖ్యానించారు. మహాకాల్ లోక్ కారిడార్ కి సాటి లేదని, దేశ అద్భుత సంస్కృతికి ఇది అద్దం పడుతుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన కోణార్క్, మొధేరా, బ్రహ్మ దేవేశ్వర్, శంకరాచార్య ఆలయాల గురించి కూడా ప్రస్తావించారు. మొదటిసారిగా చార్ ధామ్ ప్రాంతాన్ని అన్ని రోడ్లతో కలుపుతున్నట్టు తెలిపారు. చార్ ధామ్ ప్రాజెక్టు కింద నాలుగు ధామ్ లనూ కనెక్ట్ చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మోడీ 2020 ఆగస్టు 5 న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి భక్తులను రామ్ లాలా దర్శనానికి అనుమతించవచ్చునని భావిస్తున్నారు. ఇక్కడ యాత్రికులకు, భక్తులకు అవసరమైన సౌకర్యాల నిమిత్తం చేపడుతున్న భవనాలు, కేంద్రాల నిర్మాణం కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. వీటన్నింటికి రూ. 1800 కోట్లు వ్యయం కాగలదని ఈ వర్గాలు వివరించాయి.