‘నేను దొంగతనం చేసేటప్పుడు మెడకు ఉన్న చైన్ తప్ప.. అది వేసుకున్న వ్యక్తిని చూడను’ అని ‘జులాయి’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. ఈ చైన్ స్నాచర్ కూడా అచ్చం అలాగే చేశాడు. అయితే సినిమాలో బ్రహ్మానందం తన భార్య మెడలోనే చైన్ కొట్టేస్తాడు. కానీ ఇక్కడ దొంగ మాత్రం తన అమ్మమ్మ మెడలో పుస్తెలతాడును దొంగిలించాడు.
డీటైల్స్ లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్ధురాలి మెడలో నుంచి హోలీ పండుగ రోజున గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకుపోయారు. మరుసటి రోజు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినా చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తు రూట్ మార్చారు పోలీసులు. ఈ క్రమంలోనే మల్కపేట గ్రామానికి చెందిన వృద్ధురాలి మనవడు ఎక్కలదేవి కరుణాకర్, అతడి ఫ్రెండ్ కి గతంలో దొంగతనాలు చేసిన చరిత్ర ఉందని తెలుసుకున్నారు. వారిపై అనుమానంతో టెక్నాలజీని ఉపయోగించారు పోలీసులు.
దగ్గరలోని సీసీ కెమెరాలను, సెల్ ఫోన్ లోకేషన్ ల ఆధారంగా వృద్ధురాలి మనవడే అని తేల్చారు. దీంతో నిందితులను పట్టుకుని బంగారం, ఓ బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పీఎస్ కు తరలించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.