ఎందరో ముఖ్యమంత్రులు నడిచిన నేల అది. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు నిలయం. 67 సంవత్సరాలుగా… తెలుగు ప్రజల బాధలను, సుఖదుఖాలను మోసిన ప్రదేశం అది. తన కళ్లముందు ఎంతో మంది నేతలు వచ్చారు, పోయారు. తెలుగు ప్రజల పాలనా కేంద్రంగా ఎంతో వెలుగు వెలిగిన సచివాలయం కళాహీనం కానుంది.
తెలంగాణ వచ్చే నాటికి సచివాలయం అంటే చాలు ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి. హై సెక్యూరిటీ జోన్. ప్రతి రోజు వేల మంది సందర్శకులు, దేశ-విదేశాల నుండి ప్రతినిధులు, ముఖ్యమంత్రులు-మంత్రుల సమీక్షలు. అధికారుల ఉరుకులు-పరుగులు. కానీ అవన్నీ గతం. సీఎం కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఈ చారిత్రక ప్రదేశపు ఆనవాళ్లను తుడిచేసింది. ఈ సచివాలయం ఆదివారంతో చరిత్రలో కనుమరుగు కానుంది.
1952లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కాలం నుండి నేటి వరకు ఉన్నది ఇదే సచివాలయం. హైదరాబాద్ స్టేట్ ఆంద్రప్రదేశ్‌గా అవతరించినా… ఇక్కడి నుండే పాలన కొనసాగింది. బూర్గుల నుండి నేటి కేసీఆర్ వరకు. ప్రగతి భవన్ నిర్మించే వరకు సీఎం కేసీఆర్ కూడా ప్రస్తుత సచివాలయం నుండే పాలన కొనసాగించినా, ఆ తర్వాత ఆయన సచివాలయం మొహామే చూడలేదు. మంత్రివర్గ సమావేశాలు ప్రగతి భవన్ కేంద్రంగానే సాగాయి. మంత్రులు మాత్రం వచ్చిపోతూ ఉండేవారు. కానీ పాలనా కేంద్రం మాత్రం ప్రగతి భవన్ అయింది. అయితే… కొత్త సచివాలయం నిర్మించేందుకు ఇప్పుడున్న భవనాలను దాదాపుగా ఖాళీ చేశారు. తాత్కాలిక సచివాలయంగా బీర్కే భవన్‌కు మార్చేశారు. కానీ ఇప్పటికీ సచివాలయం భవనాలకు పాత సెక్యూరిటీ మాత్రం అలాగే ఉంది. ఇక భవనాలు అన్ని ఖాళీ అయిపోయాయి కనుక వాటిని కూల్చేపని మొదలుపెట్టబోతుండటంతో అప్పటి వరకు ప్రస్తుత సచివాలయానికి తాళం వేయబోతున్నారు. ఈ తాళాలు సీఎస్ దగ్గర ఉండబోతున్నాయి.
అయితే, తాము ఎన్నో ఏళ్లుగా పనిచేసిన సచివాలయం కూల్చేస్తున్నారని తెలిసిన నాటి నుండి తాళం వేస్తున్నారని వార్త వచ్చినప్పటి వరకు సచివాలయంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరు అక్కడ ఫోటోలు తీసుకుంటుండటం గమనార్హం. ఇంతమంది సీఎంలు పనిచేశారు, ఈయన అందులో ఒకరు అనుకున్నాం కానీ… ఇలాంటి భవనాలనే లేకుండా చేస్తారని అనుకోలేదంటూ పెదవి విరుస్తున్నారు.